CM Revanth Reddy: కేసీఆర్‌ సంతకం రైతుల పాలిట యమపాశమైంది – సీఎం రేవంత్

కేసీఆర్‌ సంతకం రైతుల పాలిట యమపాశమైంది - సీఎం రేవంత్

CM Revanth Reddy : కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో 511 టీఎంసీలు ఏపీకి తీసుకెళ్లవచ్చంటూ… నాడు కేసీఆర్‌ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట యమపాశమైందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. రాయలసీమకు నీటిని తరలించడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) కారణం కాదా అని ప్రశ్నించారు. నాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి వై.ఎస్‌. సీమకు నీరు తీసుకెళితే… తరువాత ఆయన కుమారుడు జగన్‌ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌(KCR) ప్రగతిభవన్‌ కు పిలిచి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాదులు వేయలేదా అని రేవంత్‌ ధ్వజమెత్తారు. అంతేకాదు కేసీఆర్‌ పాలమూరు ద్రోహి అని దుయ్యబట్టారు.

వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన ‘ప్రజాపాలన- ప్రగతిబాట’ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే 15, 20 ఏళ్లు రేవంత్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని, అప్పుడు తమ బతుకు బస్టాండు అవుతుందని భావించి… బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు భయపడి మాపై అబద్ధాలు చెబుతున్నారు. మేం 24 గంటలూ కష్టపడుతుంటే ఆ పార్టీలు మాపై బండలేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ఇందిరమ్మ మహిళా శక్తి తదితర పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌ … స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆశక్తిగా తిలకించారు. అనంతరం నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… ‘‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితలు నన్ను… సీఎం పదవి నుంచి దిగుతావా లేదా అని అడుగుతున్నారు. మా పాలమూరుకు మీరు నీళ్లు తెచ్చారా ? పదేళ్లుగా మీరు ప్రాజెక్టులు కడితే ఇక్కడి నుంచి వలసలు ఎందుకు ఆగలేదు ? భాక్రానంగల్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరకూ, శ్రీశైలం నుంచి శ్రీరాంసాగర్‌ వరకూ మా చెమటతో కట్టాం. మీరు నిర్మించిన ప్రాజెక్టు ఏదైనా ఉందా..? ఆర్డీఎస్‌ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయింది ?

ఎస్‌ఎల్‌బీసీ గతంలో కాంగ్రెస్‌ సర్కారు మొదలుపెట్టి 32 కిలోమీటర్ల తవ్వకం పూర్తిచేస్తే… మిగిలిన పనులు బీఆర్ఎస్ పాలనలో నిలిపివేశారు. ఆ కారణంగానే నేడు టన్నెల్‌ కుప్పకూలి.. 8 మంది గల్లంతయ్యారు. ఈ పాపం కేసీఆర్‌ది కాదా ? బీఆర్ఎస్ పాలనలో బడి పిల్లల యూనిఫాంలు కుట్టే పనుల్ని పెద్ద కంపెనీలకు ఇచ్చి కమీషన్లు తీసుకున్నారు. ఇప్పుడు పాఠశాలలు, హాస్టళ్లలో 1.30 కోట్ల జతల దుస్తులు కుట్టించి ఇచ్చే వ్యాపారం మహిళలకు ఇచ్చాం. 4.50 లక్షల ఇళ్లు పేద ఆడబిడ్డల పేరుమీద ఇస్తున్నాం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్వయంసహాయక సంఘాలు నిర్వీర్యమయ్యాయి. మేం వాటికి రూ.వేల కోట్లు అందించి అభివృద్థిపథంలో నడిపిస్తున్నాం. గత పదేళ్లు కేసీఆ(KCR)ర్‌ ఆయన ఇంట్లో వాళ్లకి మాత్రమే ఉద్యోగాలిచ్చారు. అధికారంలోనికి వచ్చిన ఏడాదిలోనే మేం 55 వేల కొలువులిచ్చాము అని అన్నారు.

CM Revanth Reddy – అభివృద్ధికి కిషన్‌రెడ్డి అడ్డం పడుతున్నారు – సీఎం రేవంత్

తెలంగాణకు నువ్వేం చేశావని నన్ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడుగుతున్నారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నేను కష్టపడి తెస్తే… తానే తెచ్చానని ఆయన అంటున్నారు. మెట్రో విస్తరణ, మూసీకి నిధులు రాలేదంటే… ఆపింది ఆయనే కదా.. ఆయన కడుపు నిండా అసూయ, కుళ్లు పెట్టుకుని కాళ్లలో కట్టె పెట్టే పనులు చేస్తున్నారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ హైదరాబాద్‌కు వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తే ఈ ప్రాంత ఎంపీ అయిన కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఎందుకు డుమ్మా కొట్టారు? మెట్రోను మేడ్చల్‌ వరకూ పొడిగించాలని ఆ సమావేశంలో ఈటల అడిగింది నిజం కాదా? కర్ణాటకలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత శోభ మెట్రో విస్తరణకు అనుమతి తీసుకువెళ్లారు. చెన్నై మెట్రోకు నిర్మలా సీతారామన్‌ అనుమతిచ్చారు. కానీ హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ఆయన ఇంటికి వెళ్లి మరీ అడిగాను. తెలంగాణకు ఏదీ రాకపోవడానికి సమస్య మోదీ కాదు. రాష్ట్రానికి ఏమైనా ఇవ్వాలని ప్రధానికి ఉంది. కానీ కిషన్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారో తెలియడంలేదు.

‘‘బండి సంజయ్ బడా బీసీ అంటున్నాడు. మీరు పదేళ్ళలో కులగణన ఎందుకు చేయలేదు. మీకోసం లెక్కలు తేల్చి నేను కొట్లాడుతున్నా. బలహీన వర్గాల లెక్కలు తప్పైతే ఆధారాలతో చూపండి. సొల్లు మాటలు వద్దు. గుజరాత్‌లో 29 కులాల ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. మాదిగ ఉప కులాల వర్గీకరణ చేసి చట్టసభల్లో ఆమోదించాం. మోదీ, కృష్ణ మాదిగను కౌగిలించుకున్నాడు కానీ వర్గీకరణ చేయలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది బండి సంజయ్, కిషన్ రెడ్డి. ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఎప్పుడు విదేశాల నుంచి రప్పిస్తారు. బండి సంజయ్ శాఖ పనే కదా ఇది. వారు రాగానే బొక్కలో వేస్తాం. వారితో చీకటి ఒప్పందాలు చేసుకుని కాపాడుతున్నారు. కాగితాలు ఇచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేని బోడి పార్టీ ఉప ఎన్నికల్లో తడాఖా చూపిస్తారట అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.

Also Read : Telangana High Court: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటనపై హైకోర్టులో పిల్‌ !

Leave A Reply

Your Email Id will not be published!