Sanjay Raut : ‘ముంబై’లో పట్టు కోసమే షిండేకు సీఎం చాన్స్
ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్
Sanjay Raut : మరాఠాలో బలమైన పార్టీగా ఇప్పటికీ శివసేన ఉంది. అయితే దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో పట్టు సాధించాలంటే శివసేనను దెబ్బ కొట్టాలి. అందుకే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తెలివిగా శివసేనలో చిచ్చు పెట్టింది.
ఆ మేరకు పావులు కదిపింది. వ్యతిరేక వర్గంగా తయారు చేసింది. అందులో భాగంగానే మహా వికాస్ అఘాడిని కూల్చి వేసింది.
ఈ తరుణంలో రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో పట్టు సాధించేందుకు, శివసేనను మట్టు పెట్టేందుకు ఈ నాటకం ఆడిందని సంచలన ఆరోపణలు చేశారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut).
శనివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. తమ ప్లాన్ లో భాగంగానే సీఎం పదవిలో ఏక్ నాథ్ షిండేను కూర్చో బెట్టారంటూ మండిపడ్డారు.
అయినా మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీని ఓడించాలని అనుకోవడం ఒట్టి భ్రమేనని పేర్కొన్నారు. ఎవరు పార్టీని వ్యతిరేకించినా వాళ్లు బాలా సాహెబ్ ను అవమానించినట్లేనని చెప్పారు సంజయ్ రౌత్.
అందుకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందు వల్లనే పార్టీ నుంచి , ప్రాథమిక సభ్యత్వం నుంచి ఏక్ నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలను కూడా బహిష్కరించినట్లు చెప్పారు.
బీఎంసీని గత 20 ఏళ్లుగా పాలిస్తూ వస్తోంది శివసేన. దాని ప్రాభవాన్ని తప్పించాలని అనుకుంటున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేది కాదన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut).
కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు చీలి పోయిందని కానీ ఇందిరా కాంగ్రెస అలాగే ఉందన్నారు. అలాగే బాలా సాహెబ్ ఠాక్రే ఉన్న చోట శివసేన తప్పక ఉంటుందన్నారు.
Also Read : గౌహతి ఆఫర్ వచ్చినా వెళ్లలేదు – సంజయ్ రౌత్