Hemant Soren: మధ్యంతర బెయిల్‌ ఎందుకివ్వాలి ? హేమంత్ సోరెన్ కు సుప్రీం సూటి ప్రశ్న !

మధ్యంతర బెయిల్‌ ఎందుకివ్వాలి ? హేమంత్ సోరెన్ కు సుప్రీం సూటి ప్రశ్న !

Hemant Soren: ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ కు మధ్యంతర బెయిల్‌ మంజూరు విషయమై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భూ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ కు లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మద్యంతర బెయిల్ కోరుతూ హేమంత్ సోరెన్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్‌ కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఎలా మంజూరు చేయగలమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత దీనికి సమాధానమివ్వాలని తెలుపగా హేమంత్‌ సోరెన్‌ తరఫు న్యాయవాదులు బుధవారం వరకు సమయం కోరారు. దీనితో కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Hemant Soren…

అంతకుముందు ధర్మాసనం మరో ప్రశ్నను సంధించింది. భూ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫిర్యాదును ట్రయల్‌ కోర్టు పరిశీలనలోకి తీసుకున్న తర్వాత హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) అరెస్టు చెల్లుబాటుపై రిట్‌ కోర్టు విచారణ జరపటం సమంజసమేనా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనికి సోరెన్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సమాధానమిస్తూ… దర్యాప్తు సంస్థ ఫిర్యాదును ట్రయల్‌ కోర్టు పరిశీలనలోకి తీసుకుని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మాత్రమే అభిప్రాయపడిందని తెలిపారు. నేర నిరూపణ జరగలేదన్నారు. వ్యక్తి స్వేచ్ఛ హననానికి సంబంధించిన అంశాన్ని తాము ధర్మాసనం ముందు ఉంచామని పేర్కొన్నారు. మనీలాండరింగ్‌ చట్టం కింద అరెస్టును ఎందుకు ప్రశ్నించరాదని వాదించారు. వ్యక్తి హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు రిట్‌ కోర్టు జోక్యం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు ఈ వాదనలను తోసిపుచ్చారు. హేమంత్‌ సోరెన్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వరాదని కోరారు. ఈ కేసులో బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.

Also Read : Ilaiyaraaja: మద్రాస్‌ ఐఐటీలో ఇళయరాజా సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ లెర్నింగ్ ఏర్పాటు !

Leave A Reply

Your Email Id will not be published!