AICC : దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(AICC) కోలుకోలేని రీతిలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ , గోవా, మణిపూర్ లో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎగరేసుకు పోయింది.
విచిత్రం ఏమిటంటే అన్నీ తానై ప్రియాంక గాంధీ వ్యవహరించిన ఉత్తర ప్రదేశ్ లో పట్టుమని 2 సీట్లే తెచ్చుకోవడం ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది. గోవా, ఉత్తరాఖండ్ లో వస్తుందనుకున్నా చివరకు ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావత్ సైతం ఓడి పోయాడు.
గట్టెక్కిస్తాడని అనుకున్న సిద్దూ ముఖం చాటేశాడు. పంజాబ్ లో ఊహించని రీతిలో ప్రజలు షాక్ ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ (AICC)ఊహించిన దళిత కార్డు పని చేయలేదు. సీఎం చన్నీ ఓ మొబైల్ షాపులో రిపేరర్ గా పని చేస్తున్న వ్యక్తి ఓడించడం చర్చనీయాంశంగా మారింది.
ఇక మాటల తూటాలు పేల్చుతూ వచ్చిన పీసీసీ చీఫ్ సిద్దూ సైతం ఓటమి పాలయ్యాడు. ఈ తరుణంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం, 2024 ఎన్నికల్లో పార్టీ పరిస్థితి, భవిష్యత్తు గురించి చర్చించేందుకు కీలక సమావేశం మేడం సోనియా గాంధీ అధ్యక్షతన ఈనెల 13న ఆదివారం ఢిల్లీలో జరగనుంది.
సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రధాన అంశాల గురించి చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక జీ23 పేరుతో కాంగ్రెస్ రెబల్స్ నాయకులు సైతం తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.
కొన్నేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ వస్తే పక్కదారి పట్టేలా ఉందంటూ ఆందోళన చెందారు.
Also Read : గవర్నర్ ను కలిసిన భగవంత్ మాన్