AP Advocate General: ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ !
ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ !
AP Advocate General: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలోనూ 2016నుంచి 2019వరకు దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీగా పని చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఆయన్ను అడ్వొకేట్ జనరల్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు ఇచ్చారు.
దమ్మాలపాటి శ్రీనివాస్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. 1991లో వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదే ఏడాది బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకుని హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తర్వాత సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వద్ద రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, పన్నులకు సంబంధించిన కేసుల్లో ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాదించారు. 1996 నుంచి 2005 వరకు రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా, 1999 నుంచి 2003 వరకు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 1996 నుంచి 2002 వరకు ఆదాయపు పన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2000 నుంచి 2005 మధ్య కాలంలో పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. పలు కార్పొరేట్ సంస్థలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా సేవలు అందించారు.
AP Advocate General – నవ్యాంధ్ర మొదట అదనపు ఏజీగా దమ్మాలపాటి !
2014 జూన్ 30 నుంచి ఏపీ(APAP) ‘అదనపు’ అడ్వొకేట్ జనరల్ గా హైకోర్టు, సుప్రీంకోర్టు, హరిత ట్రైబ్యునల్ వద్ద పలు కీలక కేసుల్లో ఏపీ సర్కారు తరఫున వాదనలు వినిపించి విజయం సాధించారు. హైకోర్టులో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కేసులు, చిత్తూరు జిల్లా ఎర్రచందన కూలీల ఎన్‌కౌంటర్ కేసు, చిత్తూరు జిల్లాలో హీరో మోటోకార్ప్‌కు కేటాయించిన భూ వివాదంపై కేసులు, పట్టిసీమ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన కేసు, రాజధాని అమరావతి భూసమీకరణ పథకంపై కేసులలో వాదనలు వినిపించి అవరోధాలు తొలగిపోయేలా చేశారు. 2014 జూన్ నుంచి ఏజీగా ఉన్న సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ రాజీనామా చేయడంతో 2016 మే 28న దమ్మాలపాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏజీగా నియమించింది.
చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. ఈ సందర్భంలో చంద్రబాబు హక్కులను కాపాడడంలో దమ్మాలపాటి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు తనదైన శైలిలో న్యాయ పోరాటం చేశారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా రాజధానేతర ప్రాంతవాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్-5 జోన్ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో విజయవంతంగా వాదనలు వినిపించారు.
Also Read : AP Welfare Schemes: ఏపీలో పలు ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు !