Deputy CM Bhatti : ఆ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మరో బాంబ్ పేల్చిన డిప్యూటీ సీఎం
అలాగే ప్రభుత్వంపై ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు...
Deputy CM Bhatti : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్(Deputy CM Bhatti) ఇష్టా గోష్టిగా మాట్లాడారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Deputy CM Bhatti Comments..
అలాగే ప్రభుత్వంపై ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇక జిల్లా కలెక్టర్లపై సైతం ఆయన అదే విధంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. కేటీఆర్ మాట్లాడుతున్న మాటలతో… ఆయన మైండ్ సెట్‌ను మనం అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలంతా తమతో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి తన రోల్ ప్లే చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. తమవి అన్ని ఉమ్మడి నిర్ణయాలేనని ఆయన స్పష్టం చేశారు. కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత.. కొత్త సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పీకడం ఎవరి తరం కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్పష్టం చేశారు.
గతేడాది చివరల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో పలు పథకాలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.ఆ క్రమంలో రైతు బంధు పథకంలో పలువురికి నగదు రుణ మాఫీ కావడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కాస్తా ఘాటుగా నిలదీస్తున్నారు. అందులో కేటీఆర్‌తోపాటు హరీశ్ రావు ముందు వరుసలో ఉంటారు. ఇక కేటీఆర్ అయితే.. మీడియా ముందే కాదు.. సోషల్ మీడియా ముందు సైతం చాలా యాక్టివ్‌గా ఉంటారు. వెంటనే స్పందిస్తారు. ఆ క్రమంలో పలు సందర్భాల్లో ఆయన చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పై విధంగా స్పందించారు.
Also Read : Sanatan Board : ‘సనాతన ధర్మ బోర్డు’ ఏర్పాటు తీర్మానాన్ని తోసిపుచ్చిన హైకోర్టు