Deve Gowda : ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉందన్నారు జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడ(Deve Gowda). ఇవాళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ లాగా తయారైందని ఆవేదన చెందారు. ఈ తరుణంలో ఆక్టోపస్ లాగా అల్లుకు పోతున్న భారతీయ జనతా పార్టీని నిలువరించాలంటే, ఎదుర్కోవాలంటే ముందు దేశంలోని అన్ని సెక్యులర్ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని, ఒకే గొడుకు కిందకు వస్తే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో ఆ పార్టీ నేతలకే తెలియాలన్నారు. దేశ వ్యాప్తంగా ఒకప్పుడు గణనీయమైన ఓటు బ్యాంకు కలిగిన పార్టీ ఇవాళ కొన్ని ప్రాంతాలకే పరిమితమై పోయిందన్నారు.
పార్టీకి దిశా నిర్దేశం చేసే సత్తా కలిగిన నాయకత్వం కొరవడిందని తనకు అనిపిస్తోందన్నారు దేవె గౌడ(Deve Gowda). ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే చోట కలిస్తే అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటే బావుంటుందన్నారు.
లేక పోతే రాబోయే రోజుల్లో ఆ పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ సీనియర్ నాయకుడు. తాను దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేస్తున్నానని స్పష్టం చేశారు దేవెగౌడ.
దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఆయన అభిప్రాయం చెప్పారు. విచిత్రంగా ఉన్న రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పోగొట్టు కోవడం స్వయం కృతాపరాధమేనని పేర్కొన్నారు.
అంతర్గత కుమ్ములాటలతో పాటు నాయకత్వ లేమి స్పష్టం గా కనిపిస్తోందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మేలు కోవాలని లేక పోతే మనుగడ కష్టమన్నారు దేవెగౌడ.
Also Read : ఎన్నికల్లో ఓటమిపై సీడబ్ల్యూసీ భేటీ