MUDA Scam : సీఎం బీసీ కావడం వల్లే ఇన్ని కుట్రల- డీకే శివకుమార్
మేము సిద్ధరామయ్యకు అండగా ఉంటాం. చట్టపరంగా, రాజకీయంగా కూడా పోరాడతాం...
MUDA Scam : మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) మండిపడ్డారు. ఈ కేసును చట్టబద్ధంగా తాము ఎదుర్కొంటామని, అందుకు అవసరమైన సన్నాహకాలు చేశామని చెప్పారు. సిద్ధరామయ్యకు బాసటగా కాంగ్రెస్ పార్టీ, అధిష్ఠానం, యావత్ రాష్ట్రం, మంత్రివర్గం నిలబడుతుందని అన్నారు. గవర్నర్ నిర్ణయం వెలువెడిన వెంటనే హోం మంత్రి జి.పరమేశ్వర, సీనియర్ మంత్రి కృష్ణ బైరెగౌడతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
MUDA Scam….
”మేము సిద్ధరామయ్యకు అండగా ఉంటాం. చట్టపరంగా, రాజకీయంగా కూడా పోరాడతాం. సీఎంకు వ్యతిరేకంగా ఇచ్చిన నోటీసు, అనుమతులు పూర్తిగా చట్టవిరుద్ధం. ప్రభుత్వాన్ని రెండోసారి నడుపుతున్న సిద్ధరామయ్య వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే ఈ కుట్ర జరుగుతోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది” అని డీకే శివకుమార్(DK Shivakumar) అన్నారు. ఆగస్టు 1న తాము క్యాబినెట్ సమావేశం నిర్వహించి, గవర్నర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరామని, ఫిర్యాదులో ఎలాంటి మెరిట్ లేదని, ఫిర్యాదును తోసిపుచ్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. సిద్ధరామయ్య సారథ్యంలోని పటిష్ట ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు గవర్నర్ కార్యాలయాన్ని బీజేపీ ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.
”మా సీఎం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరు. రాజీనామా చేసే ప్రసక్తి కూడా లేదు. ఆయన పదవిలో కొనసాగుతారు. మేమంతా ఐక్యంగా ఉన్నాం. పార్టీ మొత్తం ఆయన వెంటే ఉంది. ఆయన పదవీకాలంలో ఎలాంటి తప్పూ చేయలేదు. ఈ వ్యవహారాన్ని మేము చట్టబద్ధంగానే ఎదుర్కొంటాం. దేశంలోని చట్టాల పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా ప్రభుత్వాన్ని రక్షించుకుంటాం” అని డీకే ధీమా వ్యక్తం చేశారు. కాగా, గవర్నర్ అనుసరించిన విధానం పూర్తిగా చట్టవిరుద్ధమని మంత్రి కృష్ణ బైరేగౌడ అన్నారు. ఈడీ, డీసీఎంతో సీఎంపై తప్పుడు కేసు బనాయించాలని చూశారని, ఇప్పుడు గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇది సీఎంపై, కర్ణాటక ప్రజలపై జరుపుతున్న దాడి అని ఆయన ఆక్షేపించారు.
Also Read : KTR : కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ పై కేటీఆర్ ఆగ్రహం