Eknath Shinde : ఇది బాలా సాహెబ్ హిందూత్వ విజయం
సుప్రీంకోర్టు తీర్పుపై ఏక్ నాథ్ షిండే కామెంట్
Eknath Shinde : మరాఠా రాజకీయ సంక్షోభం విరాట పర్వాన్ని గుర్తుకు తెస్తోంది. రోజు రోజుకు ధిక్కార స్వరం వినిపించిన శివసేన నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండేకు మద్దతు పెరుగుతోంది.
మరో వైపు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రకటించిన డిప్యూటీ స్పీకర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. తమపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ వారంతా కోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారించిన ధర్మాసనం జూలై 11 వరకు వారిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ ఆదేశించింది. అంతే కాదు మీరు జడ్జి పాత్ర నిర్వహించ వద్దంటూ చురకలు అంటించింది.
మరో వైపు పలువురు మంత్రులు ఉద్దవ్ ఠాక్రేను వదిలి షిండే గ్రూప్ లో చేరారు. ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంకో వైపు అత్యధిక సంఖ్యా బలం కలిగిన భారతీయ జనతా పార్టీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది.
తమదే అధికారం అంటూ పేర్కొంటోంది. మరో మూడు రోజులు మాత్రమే తాము ప్రతిపక్షంగా ఉండ బోతున్నామని ఆ తర్వాత తామే పవర్ లోకి వస్తామని ప్రకటించడం కలకలం రేపుతోంది.
ఇంకో వైపు రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) స్పందించారు.
ఇది బాలా సాహెబ్ హిందూత్వ విజయానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ధర్మ వీర్ ఆనంద్ దిఘే ఆలోచనల గెలుపంటూ అభివర్ణించారు ఏక్ నాథ్ షిండే.
Also Read : తిరుగుబాటు మంత్రులకు ఠాక్రే షాక్