Rajiv Chandrasekhar : ఫ్యాక్ట్ చెకింగ్ వల్ల భంగం కలగదు
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడి
కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రం తీసుకు వస్తున్న ఫ్యాక్ట్ చెకింగ్ విధానం వల్ల స్వేచ్ఛా ప్రసంగానికి ఎలాంటి భంగం కలగదని అన్నారు. శుక్రవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాను సెన్సార్ చేసేందుకు దీనిని ఉపయోగిస్తారనే ఆరోపణలను తప్పు పట్టారు.
ఇది కేవలం ఏది అబద్దం ఏది నిజం ఏది ఫేక్ అన్న దానిని గుర్తిస్తుందన్నారు. దీని వల్ల ఆయా ప్రచురణ, ప్రసార మాధ్యమాలకు, డిజిటల్ మీడియాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు రాజీవ్ చంద్రశేఖర్.
ఇదే సమయంలో మధ్య వర్తుల కు సంబంధించిన జవాబుదారీతనం , బాధ్యతను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన తప్పుడు సమాచారం , తప్పుదోవ పట్టించే వార్తలను పరిష్కరించేందుకు కేంద్రం ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ కి నోటిఫై మాత్రమే చేస్తుందన్నారు రాజీవ్ చంద్రశేఖర్.
ఇది సర్కార్ కి సంబంధించిన సమాచారం అబద్దమా కాదా అని పారదర్శకంగా ధ్రువీకరిస్తుందని స్పష్టం చేశారు. దీని వల్ల మేలు తప్ప కీడు జరగదన్నారు. దీని ద్వారా సెన్సార్షిప్ కు దారి తీస్తాయని వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఇది అపోహ మాత్రమేనని ఆయన కొట్టి పారేశారు.
ప్రభుత్వ సంస్థ గుర్తించిన నకిలీ సమాచారాన్ని తొలగించడం లేదా తొలగించక పోవడం సోషల్ మీడియా మధ్యవర్తులకు ఎంపిక చేసే ఛాన్స్ ఉంటుందని కుండ బద్దలు కొట్టారు రాజీవ్ చంద్రశేఖర్.