DA Hiked : ఉద్యోగులు..పెన్షనర్లకు ఖుష్ కబర్
4 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
DA Hiked : దసరా పండగకు ముందు కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్ (డీఏ) 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
ఈ నాలుగు శాతం పెంపుదల వల్ల దాదాపు దేశంలోని 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి డీఏ పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వం ప్రకటించింది.
పౌర ఉద్యోగులతో పాటు రక్షణ సేవల్లో పని చేస్తున్న వారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఈ డీఏ(DA Hiked) పెంపు అమలు జూలై 1 నుంచి సిబ్బందికి వారి తాజా జీతాలతో పాటు బకాయిలు కూడా చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి 1, జూలై 1 తేదీలలో డీఏను సవరిస్తుంది. నిర్ణయాన్ని సాధారణంగా ఏడాదిలో మార్చి, సెప్టెంబర్ లలో ప్రకటిస్తుంది కేంద్రం.
గతంలో మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ 31 శాతం నుండి 34 శాతానికి పెంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ధరల పెరుగుదలను భర్తీ చేసేందుకు 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారం డీఏపై నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.
తాజాగా పెంచిన 4 శాతంతో చూసుకుంటే వేతనంలో 38 శాతానికి పెరిగినట్లయింది. 7వ పే కమీషన్ ఆధారంగా చెల్లించే వారందరికీ రూ. 18,000 బేసిక్ జీతంపై రూ. 720 పెరుగుతుంది. బేసిక్ వేతనం రూ. 25,000 అయితే రూ. 1000 అవుతుంది.
Also Read : నోట్ల రద్దుపై 12న సుప్రీం విచారణ