ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ సేనకు చుక్కలు చూపించింది. అటు బ్యాటింగ్ లో రెచ్చి పోయింది. ఇటు బౌలింగ్ లో దుమ్ము లేపింది. శుభ్ మన్ గిల్ కళ్లు చెదిరే షాట్స్ తో అలరిస్తే ఆఫ్గాన్ బౌలర్లు నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తమ బంతులతో ముప్పు తిప్పలు పెట్టారు. ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ముంబైపై గుజరాత్ 55 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.
అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 152 పరుగలకే ముంబై ఇండియన్స్ చాప చుట్టేసింది. రోహిత్ శర్మ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ జోరు పెంచినా రషీద్ ఖాన్ అద్భుత బంతికి ఔట్ చేశాడు. ఆ తర్వాత మైదానంలోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తిలక్ వర్మను ఎల్బీడబ్ల్యూ చేశాడు. 8 ఓవర్లకు 3 వికెట్లకు 45 పరుగులు చేసింది ముంబై.
గుజరాత్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ వచ్చిన కామెరాన్ గ్రీన్ 26 బంతులు ఆడి 33 రన్స్ చేసి నిష్క్రమించాడు. మరోసారి సూర్య కుమార్ యాదవ్ నిరాశ పరిచాడు. 12 బంతులు ఎదుర్కొని 23 రన్స్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ లో నేహాల్ వధేరా ఒక్కడే సత్తా చాటాడు. 21 బంతులు ఆడి 40 రన్స్ చేశాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ 37 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. గుజరాత్ జట్టులో శుభ్ మన్ గిల్ 34 బంతులు ఆడి 56 రన్స్ చేశాడు. డేవిడ్ మిల్లర్ 22 బంతులు ఆడి 46 రన్స్ చేశాడు.అభినవ్ మనోహర్ 21 బంతులు ఎదుర్కొని 42 రన్స్ చేశాడు.