Heavy Rains : ప్రకృతి ప్రకోపం రాష్ట్రాలు అతలాకుతలం
విరిగి పడిన కొండ చరియలు 31 మంది మృతి
Heavy Rains : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి వరదలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇంకా తగ్గుముఖం పట్టక పోవడంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలలో నిమగ్నం అయ్యాయి.
చాలా చోట్ల జన జీవనం స్తంభించి పోయింది. పరిస్థితి భయానకంగా ఉంది. భారీ వర్షాల కారణంగా అనేక రాష్ట్రాలలో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగి పడడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా పశ్చిమ మధ్య ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల తాకిడికి హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్ , ఒడిశా , ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలలో భారీగా వర్షాల(Heavy Rains) తాకిడి పెరిగింది.
ఇదిలా ఉండగా కొండ చరియలు విరిగి పడడంతో హిమాచల్ ప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. ఉత్తరాఖండ్ లో వర్షాల దెబ్బకు నలుగురు మృతి చెందారు.
10 మంది గల్లంతయ్యారు. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వంతెనలు కొట్టుకు పోయాయి. పలు గ్రామాల నుంచి ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వేలాది మందిని తరలించారు.
500 గ్రామాలలో 4 లక్షల మంది ప్రజలు మహానది పరీవాహక ప్రాంతంలో వరదలతో కొట్టుమిట్టాడుతున్నారు. జార్ఖండ్ లోని పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి.
లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి యాత్ర తిరిగి ప్రారంభమైంది. తీర్థ యాత్ర ట్రాక్ పై వరదలు పోటెత్తడంతో తాత్కాలిక ప్రయాణాన్ని నిలిపి వేశారు.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
Also Read : కాంగ్రాలో కూలిన రైల్వే వంతెన