Rahul Gandhi : ఇక నుంచి పార్టీ చీఫ్ సుప్రీం – రాహుల్ గాంధీ
ఎవరైనా సరే ఆయనకే రిపోర్టు చేయాల్సిందే
Rahul Gandhi : 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పార్టీ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి మల్లికార్జున్ ఖర్గే చీఫ్ గా ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర లో ఉన్న ఆ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
గెలుపొందిన మల్లికార్జున్ ఖర్గేకు అభినందనలు తెలిపారు. ఇక నుంచి ఎవరైనా సరే పార్టీ చీఫ్ ఆధ్వర్యంలోనే పని చేయాలని, ప్రతి ఒక్కరు ఆయనకు రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. పార్టీని 2024లో మళ్లీ పవర్ లోకి తీసుకు రావాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఆదోనిలోని లక్ష్మమ్మ అవ్వ టెంపుల్ లో రాహుల్ గాంధీ పూజలు చేశారు. అనంతరం తన యాత్ర కొనసాగించారు. ఇదిలా ఉండగా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరైనా సరే వారే సుప్రీం అని పేర్కొన్నారు. వారు ఏది చెబితే అది పాటించాల్సిందేనంటూ స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. పోటీ అన్నాక గెలుపు ఓటములు సహజమేనని అన్నారు. తాము వీటన్నింటిని పట్టించు కోనన్నారు. తన ముందు సవాలక్ష సమస్యలు ఉన్నాయని, తాను ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని చెప్పారు. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. పాదయాత్రను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రాహుల్ గాంధీ.
Also Read : ‘విధేయత’కు దక్కిన విజయం