High Court: హైకోర్టులో బండి సంజయ్, హరీష్‌రావులకు బిగ్ రిలీఫ్
హైకోర్టులో బండి సంజయ్, హరీష్‌రావులకు బిగ్ రిలీఫ్
High Court : తెలంగాణా హైకోర్టులో రెండు వేరువేరు కేసుల్లో బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay), బీఆర్ఎన్ నేత హరీష్ రావలకు భారీ ఊరట లభించింది. 2020 నవంబర్ లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ పై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. కార్యకర్తల సమావేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కేసు నమోదైంది. సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. మార్కెట్ పీఎస్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరఫు న్యాయవాది అన్నారు. సాక్ష్యుల వాంగ్మూలంలోనూ తేడాలున్నాయన్నారు. సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్న న్యాయవాది వివరించారు. బండి సంజయ్‌పై కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
High Court – మాజీ మంత్రి హరీష్‌రావుకు భారీ ఊరట
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్(Harish Rao) రావుకు తెలంగాణ హైకోర్టులో(High Court) ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి హరీష్‌రావుపై నమోదైన కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఇదే కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కూడా హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌టాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ లో ఫోన్ టాపింగ్ కేసు నమోదు అయ్యింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియగా… ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయిన విషయం తెలిసిందే. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు, రాధాకిషన్‌రావు వేసిన పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో హరీష్‌రావుతో పాటు రాధాకిషన్‌రావును నిందితులుగా చేర్చారు. ఇప్పటికే ఇరు వాదనలు పూర్తవడంతో తీర్పును వెలువరించింది న్యాయస్థానం. ఇద్దరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
అధికారంలో ఉన్న సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేసి.. తనను ఇబ్బందులకు గురిచేశారని.. వారి వల్ల తనకు ప్రాణహానీ ఉందంటూ రియల్‌ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ కొంతకాలం క్రితం మీడియాతో మాట్లాడారు. చక్రధర్ ఇచ్చిన సమాచారం, ఆయన ఇచ్చిన ఎవిడెన్స్‌ను ఆధారంగా చేసుకుని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అందులో సరైన ఆధారాలు లేవని హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. హరీష్‌రావు, రాధాకిషన్ వాదనలతో ఏకభవించిన హైకోర్టు… పంజాగుట్టలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
Also Read : Minister Jupally Krishna Rao: తెలంగాణ గొప్పతనం చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలు – మంత్రి జూపల్లి