Rahul Gandhi : మేల్కోక పోతే దేశాన్ని అమ్మేస్తారు – రాహుల్
మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇకనైనా మేల్కోవాలని లేక పోతే దేశాన్ని కూడా అమ్మేస్తారంటూ హెచ్చరించారు. ఇప్పటికే దేశంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేశారని, తమ వారికి అప్పగించే పనిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి కావాల్సింది ప్రేమ కాని ద్వేషం కాదంటూ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన సుదీర్ఘంగా చేపట్టిన పాదయాత్ర జనవరి 30తో ముగిసింది. గత ఏడాది 2022, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను చేపట్టారు. అక్కడి నుంచి యాత్ర నిరాటంకంగా సాగింది.
కల్లోల కాశ్మీరంలో కాలు మోపాడు రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా అన్ని వర్గాల ప్రజలు సాదర స్వాగతం పలికారు. దేశంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా కాశ్మీర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా, మరో వైపు మంచు పడుతున్నా లెక్క చేయకుండా చలిలోనే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగించారు.
తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా మతం పేరుతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే భావజాలం, దానికి వ్యతిరేకంగా మనం కలిసి నిలబడాలి. కానీ ద్వేషంతో కాదు .. అది మా మార్గం కాదన్నారు రాహుల్ గాంధీ. భారత దేశం ప్రేమగల దేశమని కొనియాడారు.
Also Read : మద్యం షాపుల్లో ఆవుల షెడ్లు తెరుస్తాం