Manish Sisodia : బీజేపీలో చేరితే కేసులన్నీ మాఫీ – సిసోడియా
తనకు మెస్సేజ్ వచ్చిందన్న డిప్యూటీ సీఎం
Manish Sisodia : ఆప్ అగ్ర నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి తనకు మెస్సేజ్ వచ్చిందని అన్నారు.
తను గనుక తమ పార్టీలో చేరితే నమోదు చేసిన కేసులన్నీ మూసి వేస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసులన్నీ అవాస్తవమని , తాను ఎవరికీ భయపడ బోనంటూ ప్రకటించారు సిసోడియా(Manish Sisodia).
తన తల నరికినా తాను తలవంచనని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. మద్యం పాలసీ ఉల్లంఘనకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ మేరకు శుక్రవారం సిసోడియా ఇంటితో పాటు దేశ వ్యాప్తంగా 31 చోట్ల సోదాలు చేపట్టింది. దాదాపు 14 గంటలకు పైగా డిప్యూటీ సీఎం ఇంట్లో సోదాలు చేపట్టింది సీబీఐ.
ఆపై మనీష్ సిసోడియా(Manish Sisodia) కు చెందిన మొబైల్ తో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం సిసోడియా స్పందించారు.
తనకు బీజేపీ నుండి వచ్చిన సందేశం గురించి తెలిపారు. ఆప్ ను విచ్ఛిన్నం చేయండి. బీజేపీలో చేరండి. మీపై నమోదు చేసిన సీబీఐ, ఈడీ, తదితర కేసులన్నీ మూసి వేసేలా మేము చూస్తామంటూ సందేశం వచ్చిందని తెలిపారు.
ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనపై నమోదు చేసిన కేసులన్నీ అవాస్తవమని మీరేం చేయాలని అనుకుంటే అది చేస్తానని ఈ సందర్భంగా బీజేపీకి సవాల్ విసిరారు.
Also Read : ఫిఫాతో కేంద్ర ప్రభుత్వం చర్చలు