Narayana Murthy : మరోసారి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ సంచలన వ్యాఖ్యలు
దేశప్రధాని నరేంద్ర మోదీనే వారానికి 100 గంటలు పనిచేస్తున్నారు...
Narayana Murthy : ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 గంటల వర్క్ వీక్ పై ఇటీవల నారాయణ మూర్తి(Narayana Murthy) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే, తన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన తనను తాను సమర్థించుకున్నారు. దేశం ముందుకు సాగాలంటే శ్రమించడమే ఏకైక మార్గం అన్నారు. ‘‘క్షమించండి.. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నేను చచ్చేంతవరకు ఇదే మాట మీద ఉంటాను’’ అంటూ సీఎఎన్‌బీసీ లీడర్షిప్ సమ్మిట్ సందర్భంగా మూర్తి తెలిపారు. 1986లో ఇండియా ఆరు రోజుల వర్క వీక్ నుంచి ఐదు రోజుల వర్క్ వీక్‌కు మారినప్పుడే తానెంతో అసంతృప్తికి గురైనట్టు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే కావలసింది విశ్రాంతి కాదు త్యాగం అన్నారు.
Infosys-Narayana Murthy Comment
దేశ ప్రధాని నరేంద్ర మోదీనే వారానికి 100 గంటలు పనిచేస్తున్నారు. ఇందుకు కృతజతగా మనం చేయాల్సింది మరింత శ్రమించి పనిచేయడమే అంటూ మోదీ అంశాన్ని ప్రస్తావించారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలు సైతం ఇలాగే ఎంతో కష్టపడి తమ దేశాభివృద్ధికి పాటు పడుతున్నాయన్నారు. ఇదే విషయంపై గతంలో మూర్తి మాట్లాడుతూ.. తన కెరీర్‌లో రోజుకు 14 గంటల పాటు పనిచేసేవాడినన్నారు. ఉదయం 6:30కి ఆఫీసుకు వచ్చి రాత్రి 8:40కి ఇంటికి వెళ్లేవాడినంటూ గుర్తుచేసుకున్నారు. నీలో ఎంత మేథస్సు ఉన్నా కష్టించి పనిచేయకపోతే దానికి విలువ లేదని.. తాను ఇదే విషయాన్ని నమ్ముతానన్నారు. దేశం పురోగతి సాధించాలంటే సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానం ద్వారా మరింత మంది మేనేజిమెంట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రధాని మోదీకి మూర్తి సూచించారు.
Also Read : CM Chandrababu : గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది