Madhya Pradesh: కంటైనర్ ట్రక్కు నుంచి రూ.12 కోట్ల విలువైన ఐఫోన్లు చోరీ !
కంటైనర్ ట్రక్కు నుంచి రూ.12 కోట్ల విలువైన ఐఫోన్లు చోరీ !
Madhya Pradesh: యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్‌ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ లో ఈ చోటు చేసుకుంది. కంటైనర్ ట్రక్కు నుంచి దాదాపు 1500లకు పైగా ఐఫోన్ల ను దుండగులు చోరీ చేశారు. ఆ ట్రక్కు హరియాణా నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ అయిన ఐఫోన్ల విలువ రూ.11-12 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ ముగ్గురు పోలీసులపై వేటు పడింది.
Madhya Pradesh IPhones Theft
ఆగస్టు 15న ఈ ఘటన చోటుచేసుకోగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ నుంచి బయల్దేరిన ట్రక్కు మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోకి రాగానే కొందరు దుండగులు దానిపై దాడి చేశారు. డ్రైవర్ కు మత్తుమందు ఇచ్చి, అతడిని బంధించి ట్రక్కులోని ఐఫోన్లను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన డ్రైవర్ చోరీని గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ట్రక్కులో ఉన్న సెక్యూరిటీ గార్డును ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. అతడే తన అనుచరులకు ఫోన్ చేసి దాడి చేయించినట్లు ప్రాథమికంగా నిర్ధరించినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా.. డ్రైవర్ ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయకుండా అలసత్వం ప్రదర్శించిన ముగ్గురు సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ చోరీపై ఇప్పటివరకు యాపిల్ సంస్థ పోలీసులను సంప్రదించకపోవడం గమనార్హం.
ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణ ఇప్పటికే పూర్తి అయిందన్నారు. ఈ చోరీ ఘటనపై బండారీ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు ట్రక్ డ్రైవర్ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ సమయంలో ఎస్ఐ భగత్‌చంద్ ఉకే, ఏఎస్ఐ రాజేంద్ర పాండేతోపాటు కానిస్టేబుల్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆ క్రమంలో వీరిపై చర్యలకు ఉప్రకమించినట్లు తెలిపారు. ఈ కేసుపై సాగర్ జోన్ ఐజీ ప్రమోద్ వర్మ ప్రత్యేక దృష్టి సారించారు.
Also Read : IndiGo: హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు !