Jairam Ramesh : ప్రధాని లేకుండా అఖిలపక్షమా
నిప్పులు చెరిగిన జైరాం రమేష్
Jairam Ramesh : కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ సంచలన కామెంట్స్ చేశారు. మణిపూర్ లో మంటలు చెలరేగుతున్నా అక్కడ కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకని స్పందించడం లేదని ప్రశ్నించారు. జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. అల్లర్లు చోటు చేసుకుని 50 రోజులకు పైగా అవుతోంది ఇప్పటి వరకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకని నోరు విప్ప లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో రాద్దాంతం చేయడం ఒక అలవాటుగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
అసలు ప్రధాన మంత్రి లేకుండా ఎలా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తారంటూ నిప్పులు చెరిగారు జైరాం రమేష్(Jairam Ramesh). మణిపూర్ లోని ఇంఫాల్ లో దేని కోసం మీటింగ్ చేపడుతున్నారో కేంద్రానికి, బీజేపీకి తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పుడు మణిపూర్ మండుతోంది. జాతుల మధ్య ఆధిపత్య పోరు ఏకంగా 100 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. 300 మందికి పైగా గాయపడ్డారు.
50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఒక రకంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మణిపూర్ ను వదిలి వేశారు. 10 వేల మందికి పైగా సైనికులు మోహరించారు. కానీ ఇప్పటి దాకా చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు జైరాం రమేష్. దిక్కులేనిదిగా మణిపూర్ మారడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకనైనా మోదీ మౌనం వీడాలని సూచించారు.
Also Read : Bhatti Vikramarka : మహమ్మారి ధరణికి మంగళం
