Jnanpith Awards 2023: గుల్జార్‌, రామభద్రాచార్యలకు జ్ఞానపీఠ్‌ అవార్డులు !

గుల్జార్‌, రామభద్రాచార్యలకు జ్ఞానపీఠ్‌ అవార్డులు !

Jnanpith Awards 2023: ప్రసిద్ద ఉర్దూ కవి, పాటల రచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు, చిత్రకూట్‌ లోని తులసీపీఠ్‌ వ్యవస్థాపకుడు జగద్గురు రామభద్రాచార్య 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన 11 మంది సాహితీవేత్తలతో కూడిన ఎంపిక కమిటీ ఈ మేరకు ప్రకటించింది. ‘రెండు భాషల్లో ప్రముఖ రచయితలైన ఇద్దరికి జ్ఞానపీఠ్‌ ఇవ్వాలని నిర్ణయించాం. సంస్కృత సాహితీవేత్త జగద్గురు రామభద్రాచార్య, ఉర్దూ కవి గుల్జార్‌ లను ఈ అవార్డుకు ఎంపిక చేశాం’ అని కమిటీ వివరించింది. 1944లో ఏర్పాటైన జ్ఞానపీఠ్‌ అవార్డును భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఏటా ఇస్తుంటారు. సంస్కృత భాషకు ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. ఉర్దూకు ఐదోసారి ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, ప్రశంసపత్రం అందజేస్తారు. 2022లో ఈ అవార్డును గోవా రచయిత దామోదర్‌ మౌజో దక్కించుకున్నారు.

Jnanpith Awards 2023 – కవిత్వంలో దిట్ట గుల్జార్‌ !

గుల్జార్‌ గా సుప్రసిద్ధుడైన సంపూరన్‌ సింగ్‌ కల్రా (89) హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉర్దూ కవిత్వంలోనూ ఆయన దిట్ట. గుల్జార్‌కు(Gulzar) 2002లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2004లో పద్మభూషణ్‌ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. హిందీ చిత్రసీమలో చేసిన కృషికి గుర్తింపుగా 2013లో ఆయనను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. 5 జాతీయ చలనచిత్ర అవార్డులను ఆయన దక్కించుకున్నారు. స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌లో ఆయన రాసిన ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్‌ అవార్డు వచ్చింది. 2010లో గ్రామీ అవార్డుకు ఆ పాట ఎంపికైంది. మాచిస్‌, ఓంకార, దిల్‌ సే, గురు చిత్రాల్లో ఆయన రాసిన పాటలకు ఎంతో పేరు ప్రఖ్యాతులొచ్చాయి.

గుల్జార్‌(Gulzar) దర్శకుడిగానూ రాణించారు. కోషిష్‌, పరిచయ్‌, ఇజాజత్‌ చిత్రాలతోపాటు టీవీ సీరియల్‌ మీర్జా గాలిబ్‌ కు ఆయన దర్శకత్వం వహించారు. సినీ ప్రయాణంతోపాటు సాహిత్యంలోనూ గుల్జార్‌ అనేక మైలురాళ్లను అధిగమించారు. కవితలనూ కొత్త పుంతలు తొక్కించారు. మూడు లైన్లతో కూడిన త్రివేణి అనే కొత్త రూపాన్ని గుల్జార్‌(Gulzar) సృష్టించారు. ఇప్పటికీ చిన్న పిల్లల కవిత్వంపై ఆయన పని చేస్తున్నారు.

22 భాషల పండితుడు జగద్గురు రామభద్రాచార్య !

రామభద్రాచార్య (74) చిత్రకూట్‌లోని తులసీ పీఠ్‌ వ్యవస్థాపకుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన హిందూ ఆధ్యాత్మిక గురువుగానూ గుర్తింపు పొందారు. విద్యావేత్త, రచయితగానూ సుప్రసిద్ధుడు. 240 వరకూ పుస్తకాలు, ఇతిహాసాలను రచించారు. ప్రస్తుతమున్న నలుగురు జగద్గురువులైన రామభద్రాచార్యల్లో ఆయన ఒకరు. 1982 నుంచి ఆయన ఈ హోదాలో ఉన్నారు. ఆయన 22 భాషల్లో పండితుడు. సంస్కృతం, హిందీ, అవధీ, మైథిలీ తదితర పలు భాషల్లో రచనలు చేశారు. 2015లో ఆయనకు పద్మ విభూషణ్‌ పురస్కారం దక్కింది. రామభద్రాచార్య అసలు పేరు గిరిధర మిశ్ర. 2 నెలల వయసులో ఉన్నప్పుడు ఆయన ట్రకోమావల్ల కంటి చూపును కోల్పోయారు. దీంతో తాతవద్దే ఆయన ఓనమాలు దిద్దారు. ఐదేళ్ల వయసు వచ్చే నాటికే భగవద్గీత మొత్తాన్ని గుర్తు పెట్టుకోగలిగే స్థాయికి చేరుకున్నారు. 8ఏళ్ల వయసు నాటికి రామచరిత మానస్‌ మొత్తాన్ని నేర్చుకున్నారు.

జ్యూరీలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి, కవి కృష్ణారావు

జ్ఞానపీఠ్‌ జ్యూరీలో ప్రతిభా రేతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌, కొంకణి రచయిత దామోదర్‌ మౌజో, బెంగాలీ రచయిత సురంజన్‌ దాస్‌, కన్నడ రచయిత పురుషోత్తమ్‌ బిలిమలే, మరాఠీ కవి ప్రఫుల్‌ షిలేదార్‌, మలయాళీ రచయిత ప్రభావర్మ, హిందీ ర చయితలు హరీశ్‌ త్రివేది, మధుసూధన్‌ ఆనంద్‌, జానకీ ప్రసాద్‌ శర్మతో పాటు తెలుగు కవి, ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో ఛీఫ్‌ ఎ.కృష్ణారావు ఉన్నారు.

Also Read : MP Vijaysai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్‌ మహారత్న’ అవార్డు !

Leave A Reply

Your Email Id will not be published!