Kerala Government: మందుబాబులకు కేరళ సర్కార్ బంపర్ ఆఫర్
మందుబాబులకు కేరళ సర్కార్ బంపర్ ఆఫర్
Kerala Government : మందుబాబులకు కేరళ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మద్యం సేవించిన తరువాత బాటిళ్ళను వృధాగా వదిలిపెట్టకుండా… వాటిని అమ్మి మరో బాటిల్ కొనుక్కునే ఆఫర్ ను ప్రభుత్వం ఇచ్చింది. ప్లాస్టిక్ మద్యం బాటిళ్ళను తిరిగి వెనక్కి ఇస్తే 20 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికే కేరళ ప్రభుత్వం (Kerala Government) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Kerala Government New Offer for Liquor Bottels
పొద్దు కుంకితే చాలు.. బార్లు, వైన్ షాప్‌ల ముందు ‘క్యూ’ చూస్తూనే ఉంటాం. ఉచితంగా ఇస్తున్నారా? అన్న చందంగా మందుబాబులు ఆవురావురుమంటూ ఎగబడుతుంటారు. మద్యం తాగేసి ఆ బాటిల్‌ను పక్కకు విసిరేస్తారు. దీంతో ఎక్కడబడితే అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు దర్శనమిస్తుంటాయి. వారి తీరును మార్చేందుకు కేరళ ప్రభుత్వం (Kerala Government) వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా రూ.20 ముందస్తు డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించింది. మళ్లీ అదే అవుట్‌లెట్‌లో బాటిల్‌ను తిరిగి ఇస్తే… డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 70 కోట్ల సీసాల మద్యం విక్రయిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రధాన ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారుగా నిలిచింది. మొత్తం అమ్ముడవుతున్న మద్యం బాటిళ్లలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. మిగతావన్నీ వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయి. దీనిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎం.బి. రాజేశ్ వెల్లడించారు. వీలైనంత వరకు గాజు సీసాల్లోనే మద్యం నింపాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత సులువు కానందువల్ల రూ.800 అంతకంటే ఎక్కువ ధర పలికిన మద్యాన్ని గాజు సీసాల్లోనే ఇవ్వాలని, రూ.800 కంటే తక్కువ ధర కలిగిన మద్యాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబరులో కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుల కింద దీనిని చేపట్టి… జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే తరహా విధానాన్ని తమిళనాడు ఇప్పటికే అనుసరిస్తోంది.
Also Read : Supreme Court: రోహింగ్యాలు చొరబాటుదారులా? శరణార్థులా? – సుప్రీం కోర్టు సూటి ప్రశ్న
