G Kishan Reddy : వికాస్ రాజ్ తీరుపై కిషన్ రెడ్డి ఫైర్
పది నిమిషాల్లో కౌంటింగ్ అప్ డేట్స్
G Kishan Reddy : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (సిఇఓ) వికాస్ రాజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(G Kishan Reddy). ఆదివారం నల్లగొండ కేంద్రంగా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయినా ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఆయా పార్టీల అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై నమోదు చేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించిన పోర్టల్ లో అప్ డేట్ చేయక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కేంద్ర మంత్రి. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిపత్యం రాగా రెండు, మూడు రౌండ్లలో బీజేపీకి లీడ్ వచ్చింది.
ఇక నాలుగో రౌండ్ లో తిరిగి గులాబీకి ఆధిక్యం వచ్చింది. ఇదిలా ఉండగా సిఇఓ వికాస్ రాజ్(Vikas Raj) పట్టించు కోలేదని ఆరోపించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా స్పందించ లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే సిఇఓ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మొత్తం ఎన్నికల వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కౌంటింగ్ వద్దకు మీడియాను అనుమతించక పోవడం, ఫోన్లు తీసుకోనీయక పోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడే ఛాన్స్ ఉందని ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం పూర్తిగా తెలంగాణలో చేతులెత్తేసిందని ఆరోపించారు. ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసినా స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్నికల సంఘం దగ్గర నుంచి అన్ని శాఖలు అధికార పార్టీకి సపోర్ట్ చేశాయంటూ ఆరోపించారు వివేక్ వెంకటస్వామి.
Also Read : రాహుల్ యాత్రకు మందకృష్ణ మద్దతు