కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ సోమవారం తన సతీమణితో కలిసి రాష్ట్రంలో పేరు పొందిన సిద్ది వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా పూజలు చేశారు. రాష్ట్రం బాగుండాలని, ప్రజలు ఆయురారోగ్యంతో ఉండాలని, సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు కేపీసీసీ చీఫ్.
అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన పడకేసిందని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలకు బీజేపీ ప్రభుత్వం కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. ఇప్పటికే ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించిన ఘనత సీఎం బొమ్మైకి దక్కుతుందన్నారు.
లింగాయత్ లను అవమానించిన తీరును ప్రజలు మరిచి పోలేరని పేర్కొన్నారు డీకే శివకుమార్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బీజేపీకి చెందిన పలువురు నాయకులు తమ పార్టీ వైపు రావాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం తమ పార్టీలో స్థలం ఖాళీగా లేదని స్పష్టం చేశారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను తమ పార్టీకి 160 సీట్లకు పైగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.