KTR Lunch at Fan House: అభిమాని ఇంటికి భోజనానికి వెళ్ళిన కేటీఆర్ !
అభిమాని ఇంటికి భోజనానికి వెళ్ళిన కేటీఆర్ !
KTR Lunch: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కూడా సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్ (ఎక్స్) లో వచ్చే పోస్టులను స్పందిస్తూ ఉండటమేకాకుండా… అదే ఫ్లాట్ ఫాంగా అనేక సమస్యలు కూడా పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ కేటీఆర్ మాత్రం అదే పంథాను కొనసాగిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లోని బోరబండ బంజారానగర్‌కు చెందిన ఇబ్రహీంఖాన్ అనే అభిమాని ఎక్స్ (ట్విట్టర్) వేదిగా కేటీఆర్(KTR) కు శుభాకాంక్షలు తెలుపుతూ తన తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. అభిమాని ఇబ్రహీంఖాన్ పోస్ట్ పై స్పందించిన కేటీఆర్… ఆదివారం నేరుగా ఆతని ఇంటికి వెళ్ళారు. అంతేకాదు ఇబ్రహీంఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి వారిని ఆశ్చర్యపరిచారు. కేటీఆర్ వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
KTR Lunch At Fans House
కేటీఆర్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడంపై ఇబ్రహీంఖాన్ స్పందిస్తూ… దివ్యాంగులైన తమ పిల్లలకు ఆసరా పింఛను ఇప్పించాలని గతంలో ఎక్స్ వేదికగా కోరగా కేటీఆర్ కార్యాలయం తక్షణమే స్పందించి పింఛను మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాదు తన పిల్లల చికిత్సకు అవసరమైన సాయం చేసేందుకు కూడా కేటీఆర్ భరోసా ఇచ్చారని గుర్తుచేసుకున్నాడు. కేటీఆర్ స్వయంగా ఇంటికి వచ్చి… తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజా జీవితంలో ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని ఆయన కేటీఆర్ ను ప్రశంసించారు.
అభిమాని ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించడంపై కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా స్పందిస్తూ… ‘‘ఇబ్రహీంఖాన్ భాయ్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. బోరబండలోని ఆయన ఇంటికి వెళ్లాను. ఆప్యాయతతో రుచికరమైన బిర్యానీ, షీర్ ఖుర్మా అందించిన అతడి కుటుంబాన్ని కలిశాను. ఆహారం, ఆతిథ్యం నచ్చాయి. వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇబ్రహీంఖాన్ సోదరుడి పిల్లలకు సహాయం చేస్తానని మాటిచ్చాను’’ అని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందించిన సేవలను గుర్తిస్తూ ఓ సాధారణ వ్యక్తి తన ఇంటికి ఆహ్వానించడం చాలా ఆనందం కలిగించిందని అన్నారు. ఇలాంటి సందర్భాలు ప్రజాజీవితంలో మరింత నిబద్ధతతో పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.