Google : ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజం గూగుల్ భారీ క్యాంపస్ ( Google)నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అమెరికాలోని మౌంటెన్ వ్యూలో దీనికి ప్రధాన కార్యాలయం ఉంది. ఆ తర్వాత అతి పెద్ద నిర్మాణానికి హైదరాబాద్ ను ఎంచుకుంది.
ఇక్కడ 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో అతి పెద్ద క్యాంపస్ ను నిర్మించ బోతోంది. దీనికి సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచంలోని ప్రధాన కంపెనీలన్నీ హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాయని తెలిపారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా ఆయన అభివర్ణించారు.
ఇందులో భాగంగా గూగుల్ రెండో అతి పెద్ద క్యాంపస్ ను నిర్మించ తలపెట్టడం హైదరాబాద్ కు తలమానికం కానుందన్నారు. తాము అన్ని కంపెనీల ఏర్పాటుకు సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో తమ ప్రభుత్వం టీఎస్ఐఎస్ పాలసీని తీసుకు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా తాను శంకుస్థాపన చేయడం సంతోషం కలిగించిందన్నారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. పౌర సేవలు, విద్య, ఇతర రంగాలలో సర్కార్ కు గూగుల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని తెలిపారు కేటీఆర్. 2017 నుంచి తమతో కలిసి పని చేస్తోందని చెప్పారు.
గూగుల్ తో ఒప్పందం వల్ల మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. యువత, మహిళలు, విద్యార్థులు, పౌర సేవల్లో మార్పు తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ఇన్వెస్టర్లకు స్వర్గధామం తెలంగాణ