KTR : కాంగ్రెస్ అంటేనే ఎప్పుడూ మొండి చేయి చూపిస్తోంది

తాజాగా రుణమాఫీ అంశంపై కేటీఆర్ మరోసారి స్పందించారు....

KTR : రైతు రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్ నేతల ఆరోపణలు ఆగడం లేదు. పూర్తి రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ రుణమాఫీ ఓ బోగస్ అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్(KTR), హరీశ్ రావు ఇప్పటికే ఈ పథకంపై అనేక విమర్శలు చేశారు. ఇంకా రైతులకు పూర్తిగా మాఫీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల ఖాతాల్లో నగదు వేసినట్లు గొప్పలు చెప్పుకుంటుందని మండిపడుతున్నారు.

తాజాగా రుణమాఫీ అంశంపై కేటీఆర్(KTR) మరోసారి స్పందించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు మాఫీ కాలేదో చెప్పేవారు లేరంటూ ఆయన ఆగ్రహించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ” కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు పంట సీజన్లు గడిచినా రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేదు. జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్నా లబ్ధిదారుల ఖాతాల్లో వెయ్యలేదు. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15వేలు ఇంకా ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12వేల హామీ ఇంకా అమలే చెయ్యలేదు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి చూపించే పార్టీ అని మరోసారి తేలిపోయింది” అని అన్నారు.

KTR Comment

మరోవైపు రుణ మాఫీ అందని రైతుల కోసం తెలంగాణ సర్కార్ వేగంగా చర్యలు చేపడుతోంది. అందుకు ఓ ప్రత్యేకమైన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారుల వివరాలను సేకరిస్తూ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తుంది. కుటుంబ నిర్ధారణ కాని రైతుల ఖాతాలు 4,24,873, ఆధార్‌లో తప్పులున్నవి 1,24,545 ఉన్నాయి. మొత్తం కలిపి 5,49,418 మంది రైతులకు ఇంకా రుణమాఫీ అందాలి. దీనిపై వ్యవసాయశాఖ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఆదివారం నుంచి రుణమాఫీకి కొత్త పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు రుణమాఫీకి సంబంధించి ‘క్రాప్‌లోన్‌ వీవర్‌’(సీఎల్‌డబ్ల్యూ) వెబ్‌సైట్‌ ఉండేది. ఇప్పుడు రైతుభరోసా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి.. క్రాప్‌లోన్‌ వీవర్‌(సీఎల్‌డబ్ల్యూ)-2024 పోర్టల్‌ను రూపొందించారు. మండల వ్యవసాయ అధికారులకు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఇచ్చారు.

ఇంకా రుణమాఫీ లబ్ధి అందని రైతుల అభ్యంతరాలను పోర్టల్‌లో ఏవోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. రైతుల వివరాలు అప్‌లోడ్‌ చేయటానికి 8 దశలను నిర్దేశించారు. రైతులు తొలుత పోర్టల్‌లో ‘క్రాప్‌లోన్‌ వీవర్‌’ బటన్‌ను క్లిక్‌ చేసి మొబైల్‌ నంబర్‌ ఆధారంగా లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలను ఎంటర్‌ చేయాలి. మూడో దశలో రైతులు వ్యవసాయ రుణం ఉన్న బ్యాంకు వివరాలను అందజేయాలి. తర్వాత రైతు పేరు లేదా ఆధార్‌ నంబర్‌తో సెర్చ్‌ చేస్తే వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ పేర్కొన్న కాలమ్స్‌లో కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయాలి. చివరగా ‘ప్రీవ్యూ’లో ఏవైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ ఉంటుంది. కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో, స్వీయ ధ్రువీకరణను అప్‌లోడ్‌ చేయాలి. కాగా ప్రస్తుతం రూ.2 లక్షల్లోపు రుణం ఉండి పెండింగ్‌లో ఉన్న 5.49లక్షల మంది రైతులపైనే ప్రభుత్వం దృష్టి సారించింది.

Also Read : Nara Lokesh: ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా విశాఖకు లోకేష్ ! ఘన స్వాగతానికి ఏర్పాట్లు !

Leave A Reply

Your Email Id will not be published!