KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని మోదీ రాజ్యాంగం నడుస్తోందంటూ ఆరోపించారు. సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పార్లమెంట్ లో నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
నామినేషన్ దాఖలు సమయంలో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా కేటీఆర్ , టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ , సంకీర్ణ ప్రభుత్వం గిరిజన మహిళ పేరుతో రాజకీయం చేస్తోందంటూ ఆరోపించారు.
తమకు వ్యక్తిగతంగా ద్రౌపది ముర్ము పట్ల ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలోనే గిరిజనులు ఎన్ కౌంటర్ జరిగినా ఆనాడు పల్లెత్తు మాట అనలేదని పేర్కొన్నారు కేటీఆర్(KTR).
ఆదివాసీ పేరుతో రాజకీయం చేయాలని అనుకోవడం భావ్యం కాదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోదీ తాను ఏది చెబితే అది నడవాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.
బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారని ఇందులో భాగంగానే బీజేపీ పవర్ లోకి వచ్చాక దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను కూలదోశారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
మధ్యప్రదేశ్ , కర్ణాటక అయిపోయింది ఇప్పుడు మరాఠాపై పడ్డారని ధ్వజమెత్తారు. ఒప్పుకుంటే ఓకే లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు.
ఈరోజు వరకు గిరిజనులకు సంబంధించి ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదని ఆరోపించారు. తాజాగా యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు రావాలని ఆహ్వానించామన్నారు.
అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మద్దతు ఇవ్వమని కోరారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేటీఆర్(KTR).
Also Read : పంతుళ్ల ప్రతాపం తలవంచిన ప్రభుత్వం