KTR: ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
ఎమ్మెల్సీ కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియాక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు. ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారు. పార్టీలో అందరం కార్యకర్తలమే… అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు, దెయ్యం ఎందుకు? అని ప్రశ్నించారు.
రేవంత్ కు ఢిల్లీలో ఇద్దరు బాసులు – కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్… రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధిష్ఠానానికి డబ్బులు ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి పదవిని కాపాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని, మూటల సీఎం అని విమర్శించారు. ‘‘రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాస్‌లున్నారు. ఒకరు రాహుల్ గాంధీ, మరొకరు మోదీ. ఈడీ ఛార్జిషీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. దీనిపై రేవంత్, రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించట్లేదు ? ఈడీ ఛార్జ్‌షీట్ లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. గతంలో ఆరోపణలు వచ్చిన సీఎంలు, కేంద్రమంత్రులు పదవుల నుంచి తప్పుకొన్నారు. గత మేలో తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మరి దానిపై విచారణ ఎందుకు చేయట్లేదు? సీఎం రేవంత్‌రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమే. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చేసిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి?’’అని ప్రశ్నించారు.
16 నెలల్లో 44 సార్లు ఢిల్లీ వెళ్లి అరుదైన రికార్డ్ సాధించారంటూ ఎద్దేవా చేశారు. నిన్న రాత్రి చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని.. అరెస్ట్ చేయొద్దని ఈడీకి చెప్పాలని వేడుకున్నారన్నారు. నిజాయితీ ఉంటే సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలని… లేదంటే ఢిల్లీ పెద్దలే రేవంత్ ను తప్పించాలని డిమాండ్ చేశారు. అవినీతి సీఎంను ఎందుకు కొనసాగిస్తున్నారో రాహుల్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి ఉందంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు రూటు అంటూ కామెంట్స్ చేశారు. యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు అయిందని ఆరోపించారు. ఈడీ చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరున్నా బీజేపీ స్పందించడం లేదన్నారు.
బీజేపీకి నిజాయితీ ఉంటే తెలంగాణలో స్కామ్ లపై స్పందించాలని అన్నారు. తెలంగాణలో స్కామ్ లపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవగాహనతో నడుస్తున్నాయన్నారు. పొంగులేటి ఇంట్లో ఈడీ తనిఖీలు జరిగి ఏడాదైందని… తనిఖీల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను బీజేపీ నేతలు ఎందుకు కాపాడుతున్నారని అడిగారు. వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రూ.45 కోట్లు వచ్చాయని.. ఈ స్కాంలో నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కేంద్రానికి కేటీఆర్ డెడ్‌లైన్
నెలరోజుల్లోగా రేవంత్ అవినీతిపై స్పందించకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామంటూ కేంద్రానికి డెడ్‌లైన్ విధించారు మాజీ మంత్రి కేటీఆర్. గవర్నర్‌ను కలిసి విచారణ కోరతామన్నారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, దెయ్యం రేవంత్‌రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించడమే తమ పని అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.