Lakshadweep: లక్షద్వీప్ లోక్ సభ ఎన్నికల్లో కీలకంగా మారిన మహిళల సమస్యలు !
లక్షద్వీప్ లోక్ సభ ఎన్నికల్లో కీలకంగా మారిన మహిళల సమస్యలు !
Lakshadweep: ప్రకృతి అందాలతో అలరారే దీవులు లక్షద్వీప్. దేశ, విదేశీ పర్యటకులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని మోదీ… స్థానిక పర్యటకాన్ని ప్రోత్సహించాలని పిలుపునివ్వడంతో మరోసారి ఆ దీవులకు కళ వచ్చినట్లయ్యింది. ఒకవైపు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న లక్షద్వీప్(Lakshadweep) లో స్థానిక మహిళలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శానిటరీ న్యాప్ కిన్ లు పడేసేందుకు సరైన వసతుల లేమీ, అత్యవసర సేవల కోసం గైనకాలజిస్టులు అందుబాటులో లేకపోవడం వంటి సవాళ్లను లక్షద్వీప్ మహిళలు ఎదుర్కొంటున్నారు. దీనితో మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో అతివల కష్టాలు కీలకంగా మారనున్నాయి. లక్షదీవుల అతివలు… తమ డిమాండ్లపై గళం విప్పేందుకు సిద్ధమౌతున్నారు.
Lakshadweep Elections Update
లక్షద్వీప్ లో ఒక లోక్ సభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ నివాసయోగ్యమైన పది దీవులున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 57,574 కాగా ఇందులో 28,442 మంది మహిళలు ఉన్నారు. దేశంలోనే అతి చిన్న లోక్ సభ స్థానంగా ఉన్న లక్షద్వీప్ కు… తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. జూన్ 4న లెక్కింపు ఉంటుంది. ఇక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఇక్కడినుంచి ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఒక్క మహిళ కూడా లేరు. దీనితో మహిళల సమస్యలు రానున్న ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే లక్షద్వీప్ మహిళలు పెద్ద ఎత్తున నాయకులను ప్రశ్నిస్తున్నప్పటికీ వారి నుండి స్పందన కరువైయింది.
దీనితో లక్షద్వీప్ లో మహిళలు నిరసన చేపట్టారు. ‘ఇక్కడి రాజకీయ నేతలకు మహిళల సమస్యలు పట్టవు. ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు పోస్టును భర్తీ చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ఇప్పటివరకు పరిష్కారం చూపలేదు. ఉన్నత చదువులకు వెళ్లాలన్నా కేరళనే దిక్కు. స్థానిక ద్వీపాలకు వెళ్లాలంటే సౌకర్యాలు ఉండవు. ఖర్చు అధికం’ అని ఓ స్థానిక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్థానికంగా వైద్య వ్యవస్థ అధ్వాన స్థితిలో ఉంది. గర్భిణుల వెతలు చెప్పలేనివి. స్కానింగ్ కావాలన్నా కవరత్తీ వెళ్లాల్సిందే. శానిటరీ న్యాప్ కిన్లను సేకరించి, పారవేసే వ్యవస్థ లేదు. వాటిని పాతిపెట్టడమో, కాల్చివేయడమో చేయాల్సివస్తోంది. ప్లాస్టిక్‌ను కాల్చడంతో స్థానిక దీవుల్లో పర్యావరణ సమస్యలు తలెత్తే ముప్పు ఉంది’ అని ఓ స్థానిక మహిళ వాపోయారు.
Also Read : Arshia Goswami: 75 కేజీల బరువెత్తిన తొమ్మిదేళ్ల బాలిక !