Maha Shivaratri Srisailam : మల్లన్న మహోత్సవాలు ప్రారంభం
భక్త జన సందోహం శ్రీశైల క్షేత్రం
Maha Shivaratri Srisailam : మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని దేశంలోని శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఏపీ, తెలంగాణకు మధ్యన నల్లమల్లలో కొలువు తీరిన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11న శనివారం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాలు ఈనెల 21వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు జరుగుతాయి. మల్లికార్జున స్వామి, పార్వతీదేవిని దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 9 లక్షల మంది దాకా భక్తులు హాజరవుతారని శ్రీశైల దేవస్థాన కమిటీ అంచనా వేస్తోంది.
ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేశాయి. గత ఏడాది కంటే ఈసారి మహా శివరాత్రి(Maha Shivaratri Srisailam) కోసం అదనపు బస్సులను నడుపుతున్నాయి.
అంతే కాకుండా ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే వారికి దర్శనంతో పాటు వసతి సౌకర్యాన్ని కల్పిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఇప్పటికే వేలాది మంది శివ స్వాములు, భక్తులు కాలి నడకన మల్లన్నను దర్శించు కునేందుకు తరలి వస్తున్నారు. రహదారి పొడవునా ఆయా గ్రామాలలో ఏర్పాట్లు చేశారు.
శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ప్రస్తుతం మల్లన్న క్షేత్రం పూర్తిగా నిండి పోయింది. 18న లింగోద్భవం జరుగుతుంది. 13న హంస వాహన సేవ, 14న టీటీడీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ, 15న రావణ వాహన సేవ, 17న గజ వాహన సేవ, 18న లింగోద్భవంతో పాటు అర్ధరాత్రి భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. 19న రథోత్సవం, 20న పూర్ణాహుతి, 21న చండీశ్వర పూజ, మండపారాధన, అర్చన , పుష్పోత్సవం , శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
Also Read : శ్రీవారి భక్తులకు తీపి కబురు – టీటీడీ