Mahapanchayat : జంతర్ మంతర్ లో మహా పంచాయత్
దేశ రాజధాని ఢిల్లీలో ఖాకీల మోహరింపు
Mahapanchayat : సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన మహా పంచాయత్(Mahapanchayat) కు పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు.
మరో వైపు రైతు అగ్ర నేత రాకేశ్ టికాయత్ తో పాటు పలువురు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టికాయత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర సర్కార్ ఆదేశాల మేరకే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కొన ఊపిరి ఉన్నంత వరకు తాను పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల వెంట భారీగా పోలీసులను మోహరించారు.
ఈ మేరకు 9 ప్రధాన డిమాండ్లతో మహా పంచాయత్ చేపట్టారు రైతులు. మహా పంచాయత్ ముగిసిన తర్వాత తాము రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని స్పష్టం చేసింది సంయుక్త కిసాన్ మోర్చా.
వేలాదిగా రైతులు తరలి వస్తున్నారు జంతర్ మంతర్ వద్దకు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది రైతులు చేరుకోవడంతో మరింత ఫోకస్ పెట్టారు.
కొన్ని చోట్ల రైతులను జంతర్ మంతర్ వద్దకు రానీయకుండా అడ్డుకుంటున్నారంటూ ఎస్కేఎం నేతలు ఆరోపించారు. కాగా రైతులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఢిల్లీ పోలీసులు.
ఇదిలా ఉండగా సంయుక్తి కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్ , హర్యానా, ఉత్తర ప్రదేశ్ , కర్ణాటక , ఇతర రాష్ట్రాల నుండి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు.
తాము ఎలాంటి విధ్వంసక కార్యక్రమాలకు పాల్పడబోమంటూ స్పష్టం చేసింది ఎస్కేఎం. ఇది సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది.
Also Read : నన్ను చంపినా సరే పోరాటం ఆపను