Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

6,897 ఓట్ల తేడాతో ఓట‌మి పాలైన శ‌శి థ‌రూర్

Mallikarjun Kharge : 137 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అధ్య‌క్షుడిగా 24 ఏళ్ల అనంత‌రం గాంధీయేత‌ర వ్య‌క్తి మ‌ల్లికార్జున్ ఎన్నిక‌య్యారు. అక్టోబ‌ర్ 18న పార్టీ చీఫ్ కోసం పోలింగ్ జ‌రిగింది. మొత్తం 9,875 ఓట్ల‌కు గాను 96 శాతం ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ తెలిపారు.

అక్టోబ‌ర్ 19 బుధ‌వారం పార్టీ అధ్యక్షుడిగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) విజ‌యం సాధించారని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు 7,897 ఓట్లు రాగా శ‌శి థ‌రూర్ కు 1,000కి పైగా ఓట్లు వ‌చ్చాయి. 6,897 ఓట్ల భారీ తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు ఖ‌ర్గే. క‌ర్ణాట‌క‌కు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.

ఆయ‌న మొద‌టి నుంచీ గాంధీ కుటుంబానికి లాయ‌లిస్ట్ (విధేయుడు)గా ఉన్నారు. ఇక తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ కాంగ్రెస్ అస‌మ్మ‌తి వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిగా గుర్తింపు పొందారు. ఇదిలా ఉండ‌గా ఖ‌ర్గే, థ‌రూర్ ఇద్ద‌రూ రాజ్య‌స‌భ స‌భ్యులు కావ‌డం విశేషం. ఇదిలా ఉండగా త‌న ఓట‌మిని అంగీక‌రించారు శ‌శి థ‌రూర్.

అంత‌కు ముందు ఆయ‌న అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించిన పోలింగ్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పోలింగ్ లో రిగ్గింగ్ చోటు చేసుకుంద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు లేఖ కూడా రాశారు. ఇక ఏసీసీసీకి 36వ చీఫ్ గా ఎన్నికైన మ‌ల్లికార్జున్ ఖర్గేను ప్ర‌త్యేకంగా అభినందించారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.

ఏఐసీసీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీతో పాటు ఎంపీ శ‌శి థ‌రూర్ కూడా అభినందించారు. అయితే వేయి మందికి పైగా త‌న‌కు ఓటు వేసిన వారి త‌ర‌పున కూడా త‌న గొంతు వినిపిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిగ్గింగ్

Leave A Reply

Your Email Id will not be published!