Manipur: ఎన్నికల వేళ మౌనం దాల్చిన మణిపుర్‌ రాష్ట్రం !

ఎన్నికల వేళ మౌనం దాల్చిన మణిపుర్‌ రాష్ట్రం !

Manipur: మైతేయ్‌, కుకీ తెగల మధ్య పోరుతో గత ఏడాదంతా అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌(Manipur)… లోక్ సభ ఎన్నికలకు ముందు మౌనం దాల్చింది. మైతేయ్, కుకీ తెలగ మధ్య జరిగిన ఘర్షణల్లో రాష్ట్ర వ్యాప్తంగా 219 మంది ఘర్షణల్లో చనిపోయారు. వందల కోట్ల ఆస్తి నష్టంతో నివురుగప్పిన నిప్పులా రాష్ట్రం మారి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికీ వేలాది మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతానికి ఘర్షణలు సద్దుమణిగినా ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌ సభ ఎన్నికలు వచ్చాయి. మణిపుర్‌ లో 2 నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఒక నియోజకవర్గంలో పూర్తిగానూ, మరో నియోజకవర్గంలో సగ భాగానికి ఈ నెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మిగిలిన సగ భాగానికి 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అంటే దాదాపుగా పోలింగ్‌ కు ఇంకా రెండు వారాలే ఉంది. అయినా ఎన్నికల హడావుడి అక్కడేమీ కనిపించడం లేదు. ఎక్కడా ర్యాలీలు, సభల్లేవు. అంతెందుకు కనీసం పోస్టర్లు కూడా కనిపించడం లేదు.

Manipur Silent

ఎన్నికల సందర్భంగా కనిపించే సంప్రదాయ ప్రచారం మణిపుర్‌(Manipur) లో ఎక్కడా కనిపించడం లేదు. కనీసం పోస్టర్లు, హోర్డింగులు కూడా కనిపించడం లేదు. కనిపించేదల్లా ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులే. భారీ ర్యాలీలు అసలే లేవు. నేతల కదలికలూ కనిపించడం లేదు. మణిపుర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తలపడుతున్నా జాతీయ స్థాయి నేతలెవరూ అటు కన్నెత్తి చూడటం లేదు. స్టార్ క్యాంపెయినర్లుగా బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ తరఫున సోనియా, రాహుల్‌ తదితరుల పేర్లను ప్రకటించినా ఇప్పటి వరకూ వారు అక్కడికి వెళ్లలేదు. మణిపుర్‌ లో నేతల ప్రచారంపై ఎన్నికల సంఘం ఆంక్షలేమీ విధించలేదు. అయినా సున్నిత ప్రాంతం కావడంతో వారు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

వేల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటుండటంతో వారంతా ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శిబిరాలవద్దే ఓటేసేలా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే అభ్యర్థులు ఈ శిబిరాలవద్దకు వచ్చే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. వస్తే తమ దారుణ స్థితిగతులపై బాధితులు నిలదీస్తారనే భయం వారిని వెన్నాడుతోంది. మైతేయ్‌ లు ఉండే లోయ ప్రాంతాలతోపాటు కుకీలు ఉండే కొండ ప్రాంతాల్లోనూ ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని కుకీ గ్రూపులు ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించాయి. దీనితో బీజేపీ, కాంగ్రెస్‌, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, మణిపుర్‌ పీపుల్స్‌ పార్టీల అభ్యర్థులు సంప్రదాయానికి భిన్నమైన ప్రచార పద్ధతులను ఎంచుకున్నారు. ఇళ్లు, పార్టీ కార్యాలయాలవద్ద సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

Also Read : National Investigation Agency: బెంగాల్‌లో ఎన్‌ఐఏ వాహనంపై రాళ్లదాడి !

Leave A Reply

Your Email Id will not be published!