National Investigation Agency: బెంగాల్‌లో ఎన్‌ఐఏ వాహనంపై రాళ్లదాడి !

బెంగాల్‌లో ఎన్‌ఐఏ వాహనంపై రాళ్లదాడి !

National Investigation Agency: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో మరో వివాదం రాజుకుంది. సందేశ్‌ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సిబ్బందిపై జరిగిన దాడిని తలపించేలా మరో ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితంనాటి ఓ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోల్‌ కతాకు తరలిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారుల వాహనంపై స్థానికులు రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో ఓ అధికారి గాయపడ్డారు. వాహనం ధ్వంసమైంది.

National Investigation Agency Attack

తూర్పు మేదినీపుర్‌ జిల్లాలోని భూపతినగర్‌ లో జరిగిన ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. భూపతినగర్‌లో 2022 డిసెంబరు 3న ఓ ఇంట్లో పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. దీనిపై దర్యాప్తు రాష్ట్ర పోలీసుల నుంచి ఎన్‌ఐఏ చేతికి వెళ్లింది. కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ శనివారం అయిదు ప్రాంతాల్లో విస్తృత సోదాలు జరిపి బలాయ్‌ చరణ్‌ మైతే, మనోబ్రత జనా అనే ఇద్దరు ప్రధాన కుట్రదారులను అదుపులోకి తీసుకుంది. అరెస్టు లాంఛనాలు పూర్తిచేయడానికి సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో తమపై మహిళలు దాడి జరిపారని అధికారులు వెల్లడించారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ దాడి ఘటనను ఆత్మరక్షణ చర్యగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమర్థించారు. అధికారులు తెల్లవారుజామున ఇళ్లలోకి చొరబడి దాడిచేస్తే మహిళలు తమను తాము రక్షించుకోవడానికి చూస్తారా? లేదా అలాగే కూర్చుంటారా అని ప్రశ్నించారు. మందుగుండు కాల్చినవారిని ఎన్నికల ముందు అరెస్టు చేయడంలో రాజకీయ కోణం దాగుందని ఆరోపించారు. ఎన్‌ఐఏ, సీబీఐలు బీజేపీకు సోదరులైతే.. ఐటీ, ఈడీలు కాషాయపార్టీకి నిధులు సమకూర్చే పెట్టెలని విమర్శించారు. ఎన్‌ఐఏ అధికారులపై జరిగిన దాడి టీఎంసీ నేతల తాలిబన్ల మనస్తత్వాలకు ప్రత్యక్ష సాక్ష్యమని బీజేపీ దుయ్యబట్టింది.

Also Read : MLA Tellam Venkata Rao: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ ! కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!