Manish Sisodia : విదేశాలకు వెళ్లకుండా సిసోడియాపై నిషేధం
కోలుకోలేని షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోలుకోలేని షాక్ తగిలింది. మద్యం పాలసీ స్కాంలో సిసోడియాతో పాటు 14 మందిని నిందితులుగా పేర్కొంది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.
సిసోడియా ఇంటితో పాటు దేశంలోని 31 చోట్ల సోదాలు చేపట్టింది. ఇదిలా ఉండగా మనీష్ సిసోడియా(Manish Sisodia) నిందితుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.
కాగా మద్యం పాలసీ విచారణ నేపథ్యంలో మనీష్ సిసోడియా విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించారు. లిక్కర్ పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో డిప్యూటీ సీఎంతో పాటు మరో 12 మందిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
దీంతో విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు నిషేధం విధించినట్లు సీబీఐ వెల్లడించింది. కాగా మనీష్ సిసోడియా ఎక్సైజ్ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మద్యం పాలసీ కేసుకు సంబంధించి 11 పేజీల డాక్యుమెంట్ లో జాబితా చేయబడిన నేరాలు అవినీతి, నేర పూరిత కుట్ర , ఖాతాలను తప్పుదారి పట్టించడం వంటివి ప్రధానంగా పేర్కొంది.
సిసోడియా నివాసంలో 14 గంటలకు పైగా సీబీఐ సోదాలు చేపట్టింది. డిప్యూటీ సీఎంకు చెందిన మొబైల్ తో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకుంది.
కాగా మద్యం పాలసీ పేరుతో కావాలని కేంద్రం రాజకీయాలు చేస్తోందని, మోదీకి ప్రధాన పోటీదారుగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని ప్రధాని మోదీ, బీజేపీ భయపడుతోందన్నారు మనీష్ సిసోడియా.
తాము ఎలాంటి తప్పులు చేయలేదని, గతంలో ఎన్ని దాడులు చేసినా ఏమీ దొరకలేదన్నారు.
Also Read : ఢిల్లీ బాద్ షా నువ్వా నేనా