Manish Sisodia : ప్రభుత్వాల కూల్చివేతలో మోదీ బిజీ
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
Manish Sisodia : తమ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, వ్యవసాయం బాగుండాలని ప్రయత్నం చేస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) చెప్పారు.
మేం ఎక్కువగా విద్యాభివృద్దిపై ఫోకస్ పెడుతుంటే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
తాము అన్ని వర్గాలకు చెందిన పిల్లలకు చదువుకునేందుకు సమాన అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా మద్యం పాలసీలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ డిప్యూటీ సీఎం ఇంటిపై సోదాలు చేపట్టింది సీబీఐ.
14 గంటల పాటు సోదాలు చేపట్టింది. సిసోడియాకు చెందిన మొబైల్ , కంప్యూటర్లను సీజ్ చేసి స్వాధీనం చేసుకుంది. అంతే కాకుండా ఆయన విదేశీ పర్యటనకు వెళ్లకుండా నిషేధం విధించింది.
ఈ దాడిలో ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు సిసోడియా. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు మాత్రమే వారికి దొరికాయని ఇందుకు సంబంధించి ఒక్క ఆధారం దొరక లేదన్నారు.
ఆప్ చీఫ్, సీఎం కేజ్రీవాల్ కు పెరుగుతున్న ప్రజాదరణను , ఆప్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి మోదీ, బీజేపీ తట్టుకోలేక పోతోందంటూ పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కావాలనే ఉసిగొల్పుతోందంటూ మండిపడ్డారు. వారి ఆటలు సాగవన్నారు.
రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు.
2024లో జరగబోయే ఎన్నికల్లో తనకు ప్రధాన సవాలుదారుగా కేజ్రీవాల్ ఉన్నారని చెప్పారు. దానిని తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు.
Also Read : విదేశాలకు వెళ్లకుండా సిసోడియాపై నిషేధం