#MeditationLife : ధ్యానం జీవన యోగం ఆనందానికి మార్గం

సంతోషం కావాలంటే ధ్యానం చేయాల్సిందే

Meditation Life: జీవితం ఓ ప్రయాణం సాగనీ తీయగా అన్న సినీ కవి రాసిన పాటను విన్నప్పుడల్లా మనసు తేలికవుతుంది. హృదయం మరింత ఆనందపు వాకిళ్ళల్లో తచ్చట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు చూస్తే కాలం మెలమెల్లగా సాగుతున్నట్టు, ఏం చేయాలో తోచేది కాదు. కానీ గత పదేళ్లుగా చూస్తే మాత్రం, ఈ ప్రపంచం మిస్సైల్ ను మించి పోయింది. ఎంతలా అంటే మనల్ని మనం గుర్తు పట్టలేనంతగా. బతకడం అంటేనే జస్ట్ తిన్నామా..పడుకున్నామా…తెల్లారిందా ..అనేలా మారి పోయింది ప్రస్తుత కాలం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దెబ్బకు ఎంతో ధృడమైన, బలమైన మానవ సంబంధాలు రాను రాను పలుచనై పోయాయి.

దీంతో గతంలో ఇల్లు ఓ పొదరిల్లులా ఉండేది. అదో పూలవనాన్ని తలపింప చేసేది. ఇల్లంతా చుట్టలతో, చుట్టు పక్కల వాళ్ళ పలకరింపులతో నిండి పోయేది. పూర్తిగా సందడిని తలపింప చేసేది. ఏ చిన్న కార్యం జరిగినా లేదా పండుగ వచ్చినా ఇల్లంతా నిండి పోయేది. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా సాగుతోంది. ప్రపంచంలో చావడం చాలా ఈజీగా మారిపోగా బతకడం మాత్రం నిత్యం నరకాన్ని చూపిస్తోంది. దీంతో బంధాలు పూర్తిగా ప్లాస్టిక్ నవ్వులతో, పలకరింపులకే పరిమితమై పోయాయి. జస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కదా అందులోనే హాయ్, బైబై చెప్పేసు కోవడంతోనే తెల్లారి పోతోంది. ఈ లోకంలో దైవం ఇచ్చిన వరం ఏదైనా ఉందంటే అది ఒక్కటే మానవ జన్మ(Meditation Life).

ప్రపంచంలో కోట్లాది జీవరాశులు ఎన్నో ఉన్నప్పటికీ ఆలోచించి, అద్భుతాలు సృష్టించే మరో ప్రపంచాన్ని, గగన తలాన్ని, చందమామను సైతం అందుకునే మానవ జన్మ మహోన్నతమైనది. ఇదే సమయంలో అనుకోని రీతిలో పోటీ ఎక్కువై పోయింది. శ్వాస పీల్చు కోవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేంత దాకా యుద్ధమే.

రాను రాను చేతుల్లో సరిపోయేంత డబ్బులున్నా..బ్యాంకుల్లో తరాలకు సరిపడా డబ్బులు ఉన్నా, చెప్పు కోవడానికి ఆస్తులు, అంతస్తులు, ఆభరాణాలు, వజ్ర వైఢూర్యాలు ఉన్నా..పాకెట్ లో డాలర్లున్నా ఏదో అసంతృప్తి మనుషుల్ని తొలచి వేస్తోంది. ఇదంతా ఉరుకుల పరుగుల జీవితం. మొత్తంగా చూస్తే శరీరాలకు అలసట ఎక్కువై పోయింది..శాంతి కరువై పోయింది. ఏకంగా జనం తమ నుంచి తాము వేరై పోయారు.

దీంతో ప్రతి ఒక్కరు లక్షలాది రూపాయలు తగలేస్తున్నారు. కొందరు తట్టుకోలేక వ్యసనాలకు బానిస అవుతే ..మరికొందరు మాత్రం తమను తాము తెలుసు కోవడానికి, ఆనందం, సంతోషం వెతుక్కోవడానికి, దేవాలయాలను, దేవుళ్లను, బాబాలను, యోగులను, స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో యోగం..ధ్యానం ఫక్తు వ్యాపారంగా మారింది. ఇందులో ఓ పది శాతం మాత్రమే నిజాయితీగా మానవ లోకానికి మేలు చేకూరుస్తుంటే మాగతా వాళ్లంతా కోట్లకు పడగలెత్తుతున్నారు.

ఆశ్రమాలు, పీఠాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మనల్ని మనం ప్రేమించు కోక పోవడమే మన అసంతృప్తికి కారణం. అందుకే ఇష్టమైన వాటితో మమేకమై పోతే జీవితం హాయిగా సాగుతుంది. బతుకు పండగ అవుతుంది. మనల్ని మనం తెలుసుకుని, స్వాంతన పొందే మార్గమే ధ్యానం(Meditation Life). అదే జీవన యోగం. ఇందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిన పని లేదు. మీలోనే ఉంది..జస్ట్ ప్రయత్నం చేస్తే కావాల్సినంత జోష్ దక్కుతుంది.

No comment allowed please