Minister Parameshwara: లైంగిక వేధింపుల విషయంలో చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి క్షమాపణ
లైంగిక వేధింపుల విషయంలో చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి క్షమాపణ
Parameshwara : పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమేనంటూ కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈక్రమంలో తన వ్యాఖ్యలపై పరమేశ్వర దిద్దుబాటు చర్యలకు దిగారు. తన మాటలకు మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
Minister Parameshwara Case..
ఈ సందర్భంగా కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర(Parameshwara) మాట్లాడుతూ… ‘నేను చేసిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారు. వాటిని వక్రీకరించే అవకాశం మరికొందరికి ఇవ్వను. నా వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. మహిళల భద్రతపై నిరంతరం ఆందోళన చెందే వారిలో నేను ఉంటా. వారి క్షేమం కోసం నిర్భయ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నాం. నా మాటలకు ఎవరైనా మహిళలు బాధపడి ఉంటే క్షమించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే ?
గతవారం సుద్దగుంటెపాల్య ప్రాంతంలోని ఓ వీధిలో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తుండగా… ఒక వ్యక్తి ఒక్కసారిగా వెనకనుంచి వచ్చి వారిలో ఓ యువతిని అసభ్యంగా తాకి పరారయ్యాడు. ఏం జరుగుతుందో తెలియక షాక్ అయిన యువతులు భయంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈవిషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం బయటపడింది. దీని ఆధారంగా బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై పరమేశ్వర(Parameshwara) మాట్లాడుతూ… బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాలలోని వీధుల్లో మహిళలపై ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. అయితే, యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. మహిళలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉన్నతస్థానంలో ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపోతున్నారు. అటు బీజేపీ నేతలు సైతం పరమేశ్వర మాటలపై తీవ్రంగా స్పందించారు. దీనితో నష్ట నివారణా చర్యలు ప్రారంభించిన మంత్రి పరమేశ్వర… మహిళలకు క్షమాపణ చెప్పారు.
Also Read : CM Mamata Banerjee: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్ కు స్వల్ప ఊరట