Minister S Jaishankar: కేంద్ర మంత్రి జైశంకర్ కు బుల్లెట్‌ప్రూఫ్ కార్లు
కేంద్ర మంత్రి జైశంకర్ కు బుల్లెట్‌ప్రూఫ్ కార్లు
Minister S Jaishankar : భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. పాకిస్తాన్ దౌత్య వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి జై శంకర్(Minister S Jaishankar) భద్రత దృష్ట్యా అదనంగా రెండు ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కార్లను కేటాయించింది. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జైశంకర్ కు ఇప్పటికే సీఆర్‌పీఎఫ్ కమాండోలతో జెడ్-కేటగిరీ భద్రత కొనసాగుతోంది. గతంలో ఆయనకు పొంచి ఉన్న ముప్పు అంచనాలపై కేంద్రం 2023 అక్టోబరులో భద్రతను వై కేటగిరీ నుంచి జెడ్-కేటగిరీకి పెంచింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మరోసారి ఆయన భద్రతను కట్టుదిట్టం చేయడం గమనార్హం. జైశంకర్ భద్రత పెంపు.
Minister S Jaishankar Security..
ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(Minister S Jaishankar) కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. తాజా సమీక్ష అనంతరం మంత్రి కాన్వాయ్ లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీనిలో భాగంగా 33 మందితో కూడిన సీఆర్‌పీఎఫ్ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.
జెడ్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్ జెడ్–ప్లస్ (అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్‌పీఎఫ్ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది.
Also Read : Minister Vijay Shah: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్ షాపై కేసు నమోదు