Kolkata Doctor Rape Case: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి విధ్వంసం ! ఆర్‌జీ కర్ ఆసుపత్రిపై దుండగుల దాడి !
కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి విధ్వంసం ! ఆర్‌జీ కర్ ఆసుపత్రిపై దుండగుల దాడి !
Kolkata: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata)లో జూనియర్ డాక్టర్(Doctor)పై అత్యాచారం, హత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. యువ వైద్యురాలు శవమై కనిపించిన ప్రభుత్వ ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో దుండగులు వీరంగం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. అడ్డొచ్చిన నర్సులను నెట్టేశారు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో వార్డుల్లో విధ్వంసానికి దిగారు. హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా నిరసనలు తెలుపుతోంటే.. మరోవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, ఔట్ పేషంట్ విభాగాలతో (ఓపీడీ)పాటు సీసీ టీవీలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటి వరకూ తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు గురువారం కోల్‌కతా(Kolkata) పోలీసులు వెల్లడించారు.
అర్థరాత్రి సుమారు 40 మంది వరకూ నిరసనకారుల రూపంలో వచ్చిన దుండగులు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారని, వీరి దాడిలో ఓ పోలీసు వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. మరికొంత మంది పోలీసులకు గాయాలైనట్లు తెలిపారు. గుంపును చెదరగొట్టడానికి తాము బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్లు వెల్లడించారు. ఆసుపత్రిపై దాడులతో రాష్ట్రంలో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. హత్యాచారం జరిగిన ఆసుపత్రి గది ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైందన్న వార్తలపై కోల్‌కతా(Kolkata) పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నేరం జరిగిన సెమినార్ గది వద్దకు ఎవరూ వెళ్లలేదు. ధ్రువీకరణ లేని వార్తలను వ్యాప్తి చేయొద్దు. వదంతులు వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని వెల్లడించారు.
Kolkata – దుండగుల దాడితో మిన్నంటిన రోగుల హాహాకారాలు !
ఆసుపత్రి వార్డుల్లో దుండగులు వీరవిహారం చేస్తుండడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. చికిత్స పొందకుండానే కొందరు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. విలువైన వైద్య పరికరాలు, ఔషధాలను దండుగులు ఎత్తుకుపోయినట్లు తెలిసింది. విధ్వంసం జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలో విధుల్లో ఉన్న పోలీసులు చేతులెత్తేశారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. నర్సులకు కేటాయించిన వార్డుల్లో ఆశ్రయం పొందారు. తమను దాచిపెట్టండి అంటూ ఇద్దరు పోలీసులు వేడుకున్నారని ఓ నర్సు చెప్పారు.
దాడిపై నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు, నర్సులు !
ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగుల వీరంగం పట్ల డాక్టర్లు, నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు. తమకు భద్రత కలి్పంచాలని డిమాండ్ చేశారు. తమపై దాడులను సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. పోలీసుల సమక్షంలోనే దుండగులు రెచ్చిపోయారని, తమపై చెయ్యి చేసుకున్నారని ఆరోపించారు. తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఉద్యమాన్ని విరమించుకొనేలా చేయాలన్నదే వారి ప్రయత్నమని చెప్పారు. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.
వారు దీదీ పంపిన గూండాలు – బిజేపీ
సీబీఐకి సాక్ష్యాలు చిక్కకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… ఆసుపత్రిపైకి తృణమూల్ గూండాలను పంపారని బిజేపీ నేత సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు. దాడుల వెనుక పలు రాజకీయ పార్టీల హస్తం ఉందని ప్రత్యారోపించారు. నిరసనలు చేపడుతున్న విద్యార్థులు, వైద్యులతో తనకు ఎటువంటి ఫిర్యాదు లేదని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఆసుపత్రిపై జరిగిన దాడులను భారత వైద్య సంఘం (ఐఎంఏ) తీవ్రంగా ఖండించింది.
సమాజానికి సిగ్గుచేటు – గవర్నర్ ఆనంద బోస్
ఆర్‌జీ కర్ ఆసుపత్రిపై దాడి సమాజానికి సిగ్గుచేటని పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ వ్యాఖ్యానించారు. విధ్వంసం జరిగిన ఆసుపత్రిని గురువారం మధ్యాహ్నం ఆయన సందర్శించి నిరసనలు చేపట్టిన వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…‘నేను మీతో ఉన్నాను. ఈ సమస్యను కలిసి పరిష్కరించుకుందాం. నేను మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. నా కళ్లు, చెవులు తెరిచే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. దాడులతో అభద్రతా భావానికి లోనైన వైద్యుల కోసం గవర్నర్ ‘అభయ హోం’ను ఏర్పాటు చేశారు.
Also Read : Nalin Prabhat: జమ్ముకశ్మీర్ డీజీపీగా ఏపీ కేడర్ ఐపీఎస్ నలిన్ ప్రభాత్ !