Miss England: మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలపై మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు

మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలపై మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు

Miss England : తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్‌ వరల్డ్‌–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్‌ ఇంగ్లండ్‌(Miss England) మిల్లా మాగీ తాజాగా ‘ద సన్‌’ అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కల్పించారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలు బ్యూటీ విత్‌ పర్పస్‌కు అనుగుణంగా లేవని… అదంతా డొల్లేనని దుయ్యబట్టారు. పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్‌ వేసుకోవాలని ఆదేశించారని… అల్పాహారం సమయంలోనూ బాల్‌ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు.

‘పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరుగురు అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్‌ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు. ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశా. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేశ్యలా భావించా’అని మిల్లా మాగీ చెప్పుకొచ్చింది.

సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తినింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగీ(Milla Magee) పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవాల్సి వచ్చిందని… దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది. ‘నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్‌ వరల్డ్‌ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదు. అందుకే మేకప్‌ లేకుండానే బయటకు వెళ్లడం ప్రారంభించా. అల్పాహారం తీసుకోవడానికి నాకు నప్పేవి, తగిన దుస్తులను ధరించడం ప్రారంభించాఅని మిల్లా మాగీ చెప్పింది.

Miss England – మాగీ ఆరోపణలన్నీ నిరాధారం – మిస్‌ వరల్డ్‌ సీఈఓ

మిస్‌ ఇంగ్లండ్‌(Miss England) మిల్లా మాగీ ఆరోపణలను మిస్‌ వరల్డ్‌–2025 సీఈఓ జూలియా మోర్లే ఓ ప్రకటనలో ఖండించారు. ఆమె ఆరోపణలను నిరాధార, కల్పితమైనవిగా అభివర్ణించారు. తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పోటీల నుంచి వైదొలగుతానని మిల్లా మాగీ(Milla Magee) చెప్పడంతో ఆమె స్వదేశం చేరుకొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మాగీ స్థానంలో మిస్‌ ఇంగ్లాండ్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన చార్లెట్‌ గ్రాంట్‌ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకుందని… ఈ పోటీలో ఇంగ్లండ్‌ ప్రాతినిధ్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. మిల్లా మాగీ ఆరోపణల నేపథ్యంలో పోటీలో పాల్గొన్న సందర్భంగా ఆమె నిర్వాహకులను ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు, అనుభూతులను పంచుకున్న వైనాన్ని వీడియోలను విడుదల చేయనున్నట్లు జూలియా మోర్లే వివరించారు. మిస్‌ వరల్డ్‌ సంస్థ అంకిత భావంతో ఉందని.. బ్యూటీ విత్‌ పర్పస్‌ అనే పంథాకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

టాప్‌ మోడల్‌ చాలెంజ్‌ విజేత మిస్‌ ఇండియా

మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే ముందు ఒకే ఒక్క చాలెంజ్‌ రౌండ్‌ ఉందనగా మిస్‌ ఇండియా నందినీ గుప్తా టాప్‌–40 జాబితాలో చోటు దక్కించుకుంది. గ్రాండ్‌ ఫినాలే నాటికి పోటీలో ఉండాలంటే కచ్చితంగా ఖండానికి 10 మంది చొప్పున ఉండే ఈ టాప్‌–40లో చోటు దక్కించుకోవాల్సిందే. ఫాస్ట్‌ట్రాక్‌ పోటీ రౌండ్లలో విజయం సాధించడం ద్వారా నేరుగా అందులో చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మూడు రౌండ్లలో ఆమె విజయం సాధించలేకపోవడంతో మిస్‌ వరల్డ్‌ పోటీలను అనుసరిస్తున్న భారత అభిమానుల్లో నిరాశే మిగిలింది. శనివారం హైటెక్స్‌లో జరిగిన టాప్‌ మోడల్‌ ఫ్యాషన్‌ షోలో నందినీ గుప్తా… పటోలా లెహంగా వస్త్రధారణతో ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌తో న్యాయనిర్ణేతల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆధునిక వస్త్రధారణలోనూ తళుక్కున మెరిసింది. వెరసి ఈ రౌండ్‌లో ఆసియా–ఓషియానియా గ్రూప్‌ నుంచి ఆమె న్యూజిలాండ్‌ సుందరితో కలిసి టాప్‌–8లో నిలిచింది. చివరకు న్యూజిలాండ్‌ భామను వెనక్కు నెట్టి విజేతగా ఎంపికైంది.

మిస్‌ వరల్డ్‌ పోటీలు ఆసాంతం తెలంగాణ(Telangana) సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ముందుకు సాగుతుండగా దాన్ని మరింత విస్తరిస్తూ శనివారం టాప్‌ మోడల్‌ పోటీలు సాగాయి. ప్రపంచ ప్రఖ్యాత పోచంపల్లి వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ, గద్వాల చీరలతోపాటు లెహంగా, గాగ్రా చోలీ తదితర భారతీయ వస్త్రాలు ధరించిన అందాల భామలు.. ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. తొలుత తెలంగాణ(Telangana) టాప్‌ డిజైనర్లు రూపొందించిన తెలంగాణ–భారతీయ సంప్రదాయ వ్రస్తాలతో క్యాట్‌ వాక్‌ చేశారు. అనంతరం టాప్‌ డిజైనర్లు రూపొందించిన ఆధునిక వ్రస్తాలతో రెండోసారి ర్యాంప్‌పై నడిచారు. ఈ రెండు రౌండ్లకు కలిపి న్యాయనిర్ణేతలు మార్కులు వేశారు. హైహీల్స్, పొడవాటి వ్రస్తాలు ధరించిన జపాన్‌ సుందరి క్యాట్‌వాక్‌ రౌండ్‌ చివర్లో అదుపుతప్పి ర్యాంప్‌పై పడిపోయింది. ఆ వెంటనే లేచి తేరుకుని వాక్‌ పూర్తి చేసింది.

తెలంగాణ డిజైన్లకు న్యాయ నిర్ణేతల ప్రశంసలు

ఫ్యాషన్‌ ఫినాలేకు హాజరైన న్యాయ నిర్ణేతలు, ఆహూతులు.. తెలంగాణ సంప్రదాయ డిజైన్లను చూసి ప్రశంసలు కురిపించారు. పోటీదారులంతా స్థానిక చేనేతలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం ఆ డిజైన్లకు, తయారీదారులకు గుర్తింపును, మార్కెటింగ్‌ అవకాశాలను అందిస్తుందన్నారు. తెలంగాణ చేనేత వ్రస్తాలతో డిజైన్లు చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్‌ అర్చనా కొచ్చార్‌ అన్నారు. దీని ద్వారా చేనేత చీరలకు ప్రపంచ ఖ్యాతి దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

Also Read : Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య – అమెరికాలో శశిథరూర్‌ బృందం

Leave A Reply

Your Email Id will not be published!