MLC Kavitha SC : కవిత పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

MLC Kavitha SC Petition : సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటీషన్ పై(MLC Kavitha SC Petition) నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత సుప్రీంను ఆశ్రయించారు. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో విచారించడంపై అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో తమ వాదనలు వినాలని ఈడీ కూడా కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనితో నేడు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఇరు వర్గాల వాదనలను విననుంది. అయితే వాదనలు విననున్న ఇవాళ సుప్రీం ఏదైనా తీర్పు ఇస్తుందా? లేక విచారణ వాయిదా వేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. కాగా ఈనెల 24న కవిత పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉండగా..27 జాబితాలో విచారించాలని సుప్రీం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. మొదటగా ఆమెకు ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కవిత ఆరోజు విచారణకు హాజరు అయ్యారు. సుమారు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది.

అయితే ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో రాత్రి వరకు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈడీ అధికారులు నిబంధనలకు లోబడి విచారణ జరపడం లేదని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24న విచారణ జరుపుతామని పేర్కొంది.

Also Read : ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను విధానం ..

Leave A Reply

Your Email Id will not be published!