Modi BBC Row : కేంద్రం నిషేధం ప్రతిపక్షం ఆగ్రహం
భారత్ లో ఉంటే ఈపాటికి ఈడీ ఉండేది
Modi BBC Row : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ తీవ్ర కలకలం రేపింది. వివాదానికి దారి తీసింది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ వెంటనే మోడీ బీబీసీ డాక్యుమెంటరీ లింక్ ను సోషల్ మీడియా నుంచి తొలిగించాలని ఆదేశించింది.
లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది(Modi BBC Row). ఇదిలా ఉండగా ఈ డాక్యుమెంటరీని రెండు విభాగాలుగా ప్రసారం చేయాలని నిర్ణయించింది బీబీసీ. తొలి ఎపిసోడ్ ను జనవరి 17న ప్రసారం చేసింది. అన్నీ అవాస్తవాలు ఉన్నాయని, కావాలని మోడీ వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నం చేసిందంటూ కేంద్రం మండిపడింది.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ తరుణంలో బీబీసీ సీరీస్ లింక్ లను తొలగించడం, నిషేధం విధించడంపై ప్రతిపక్షాల నేతలు భగ్గుమన్నారు. తప్పు చేయక పోతే ఎందుకు కేంద్రం వీటిని అడ్డుకుంటుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గౌరవ్ వల్లభ్ సీరియస్ కామెంట్స్ చేశారు. భారత ప్రభుత్వంలో మేక్ ఇన్ ఇండియా వంటి బ్లాక్ ఇన్ ఇండియా పథకం ఉందని ఎద్దేవా చేశారు. స్టార్టప్ ఇండియాకు కష్టమైన ప్రశ్నలు అడగడాన్ని కేంద్రం తట్టుకోలేక పోతోందని మండిపడ్డారు.
బీబీసీ మెయిన్ ఆఫీస్ గనుక ఢిల్లీలో ఉంటే ఈపాటికి ఈడీ రంగంలోకి దిగి ఉండేదన్నారు. టీఎంసీ ఎంపీలు డెరిక్ ఓ బ్రెయిన్ , మహూమా మోయిత్రా సైతం డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో లింకులను ట్వీట్ చేయడం కలకలం రేపింది.
Also Read : హిందూత్వ ప్రయోగశాలగా కోస్తా కర్ణాటక