MP Vallabhaneni Balasouri: వైసీపీకు మరో షాక్ ! మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా !
వైసీపీకు మరో షాక్ ! మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా !
MP Vallabhaneni Balasouri: ఏపీలో అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న బాలశౌరి… తన ఎంపీ పదవికి, వైసీపీ పార్టీకు రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు మరో రెండు రోజుల్లో జనసేనలో చేరబోతున్నట్లు కూడా తన ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపినట్టు ఎంపీ తెలిపారు. దీనితో గుంటూరులోని నివాసంలో ఉన్న బాలశౌరిని జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్ కలిశారు. పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. రాజీనామా విషయం తెలుసుకున్న ఎంపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాలశౌరి ఇంటికి తరలివస్తున్నారు. అయితే బాలశౌరి పార్టీ మార్పును వైసీపీ అధిష్టానం ముందే పసిగట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలశౌరిను బుజ్జగించడం కాని… రాజీనామాపై స్పందించడం కాని చేయలేదని తెలుస్తోంది.
MP Vallabhaneni Balasouri – ఎమ్మెల్యేలతో విభేదాలే ఎంపీ రాజీనామాకు కారణమా ?
ఎంపీ బాలశౌరి రాజీనామాకు… మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కు మధ్య విభేదాలే కారణమని తెలుస్తోంది. ఆ రెండు నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా… ఎంపీను దూరం పెడుతున్నట్లు పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో మచిలీపట్నం పర్యటన సందర్భంగా ఎంపీ బాలశౌరిని(MP Vallabhaneni Balasouri)… పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ క్రమంలోనే… ‘‘ పేర్ని నాని… బందరు నీ అడ్డా కాదు. నీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నన్ను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారు. ఇకపై బందరులోనే ఉంటా.. కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎవరేం చేస్తారో చూస్తా. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా’’ అని పేర్ని నానికు ఎంపీ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు.
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తో కూడా ఎంపీకు పొసగడం లేదు. మరోవైపు అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ ఎదుటే ఆయన ముఖ్య అనుచరుడిపై స్థానిక ఎమ్మెల్యే, వైకాపా శ్రేణులు దాడికి దిగారు. వీటన్నింటికి తోడు అధిష్ఠానం మద్దతు కూడా బాలశౌరికి లభించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : Ashwini Vaishnaw : ప్రతి ప్రయాణీకునికి టికెట్ పై 55శాతం రాయితీ అంటున్న రైల్వే మంత్రి