Mudragada Padmanabham: ముద్రగడతో వైసీపీ నాయకుల భేటీ ! వైసీపీలోనికి ముద్రగడ కుటుంబం ?
ముద్రగడతో వైసీపీ నాయకుల భేటీ ! వైసీపీలోనికి ముద్రగడ కుటుంబం ?
Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో వైసీపీ ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిధున్ రెడ్డి భేటీ అయ్యారు. మిధున్ రెడ్డితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు… కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్ళి సుమారు రెండు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ముద్రగడను పార్టీలోనికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ముద్రగడతో భేటీ అనంతరం ఎంపీ మిధున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Mudragada Padmanabham Meet with…
ఎంపీ మిధున్ రెడ్డి మాట్లాడుతూ… పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిని కలిసి వైసీపీలోనికి ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ముద్రగడ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కాపు ఉద్యమాన్ని నడింపిచిన వ్యక్తి. అతను పదవి లేదా డబ్బు కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదు. అదే సమయంలో పెద్దలని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ముద్రగడ పద్మనాభం అన్ కండీషనల్ గా పార్టీలోనికి చేరుతారని నమ్మకం మాకు ఉంది… అదే సమయంలో సీఎం జగన్ వారికి సముచిత స్థానం కల్పిస్తారని ధీమా కూడా మాకు ఉంది అని ఎంపీ మిధున్ రెడ్డి స్పష్టం చేసారు.
అయితే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమనే ప్రచారం అతని సన్నిహిత వర్గాల్లో జరగుతోంది. గతంలో జనసేన నాయకులు వెళ్లి ముద్రగడను తమ పార్టీలోనికి ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరడం ఖాయమని కొంతమంది జనసేన నాయకులు కూడా బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన రెండు సార్లు వాయిదా పడటం… టీడీపీ-జనసేన పొత్తులో జనసేనకు కేవలం 24 సీట్లను కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ… పవన్ కళ్యాణ్ కు ముద్రగడ బహిరంగ లేఖ రాసారు. దీనితో జనసేన లోనికి వెళ్లే ఆలోచనను ముద్రగడ విరమించుకున్నారని ప్రచారం జరిగింది.
ఇంతలోనే పిఠాపురం వైసీపీ ఇన్ చార్జ్, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్ కు సీఎంఓ నుండి పిలుపురావడంతో ముద్రగడ కోసం ఆమెను ప్రత్తిపాడు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా వైసీపీ నాయకులు ముద్రగడను(Mudragada Padmanabham) కలిసి పార్టీలోనికి ఆహ్వానించడంతో… వైసీపీలో చేరడానికి ఆయన త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ముద్రగడ లేదా తన కుమారుడు పిఠాపురం నుండి వైసీపీ తరపున పోటీ చేస్తారని… ఎన్నికలకు ముందే ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ముద్రగడ కుటుంబానికి ఇవ్వడానికి వైసీపీ ఆఫర్ చేసిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : Kadiyam Srihari : ఎన్నికల సమయంలో పార్టీలు మారడం కామన్ అంటున్న కడియం