Mumbai Hoarding Collapse: ముంబయి హోర్డింగ్ కూలిన ఘటనలో 16కు చేరిన మృతుల సంఖ్య !
ముంబయి హోర్డింగ్ కూలిన ఘటనలో 16కు చేరిన మృతుల సంఖ్య !
Mumbai Hoarding Collapse: ముంబయిలోని ఘాట్కోపర్ వద్ద హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా… బుధవారం రాత్రి మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఆ మృతులు… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విశ్రాంత మేనేజర్ మనోజ్ చన్సోరియా(60), ఆయన భార్య(59)గా పోలీసులు గుర్తించారు.
Mumbai Hoarding Collapse Updates
సోమవారం సాయంత్రం ముంబయి(Mumbai)లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ ఒక పెట్రోల్ పంప్‌పై కుప్పకూలిన ఘటన విదితమే. దీనితో కూలిన హోర్డింగ్ క్రింద దాదాపు 100 మంది చిక్కుకుపోయారు. వారిలో ఈ దంపతులు కూడా ఉన్నారు. ఆ శిథిలాలను తొలగిస్తోన్న తరుణంలో ఒక కారులో వీరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ముంబయి ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చన్సోరియా… రెండు నెలల క్రితమే పదవీ విరమణ చేశారు. తర్వాత వారు నగరాన్ని వీడి, జబల్‌పుర్‌కు షిఫ్ట్ అయ్యారు. వీసా నిమిత్తం కొద్దిరోజుల క్రితం వారు ఇక్కడకు వచ్చారని బంధువులు తెలిపారు. పని పూర్తి చేసుకొని జబల్పుర్ వెళ్తుండగా… పెట్రోల్ ఫిల్ చేసుకునేందుకు బంక్ వద్ద కారు ఆపిన సమయంలోనే మృత్యువు వారిని కబళించింది.
అయితే రెండు రోజులుగా తల్లిదండ్రులు తన ఫోన్ ఎత్తకపోవడంతో అమెరికాలో ఉన్న వారి కుమారుడు ఆందోళన గురయ్యాడు. ఇక్కడ ఉన్న బంధువులను అప్రమత్తం చేయడంతో… వారు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వారి దుర్మరణం వార్త తెలిసింది. ఇక ఈ ఘటనలో 41 మంది గాయపడ్డారు. ఈ బిల్‌బోర్డు యజమాని భవేశ్ భిండే అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 40X40 ఉండాల్సిన ఈ ఇనుప హోర్డింగ్‌ను ఏకంగా 120X120 సైజులో చేయించారు. ఇది లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు ఎక్కే సైజని ఓ ఆంగ్లపత్రిక పేర్కొనడం సంచలనంగా మారింది.
Also Read : AP Schools : ఏపీ విద్యార్థులకు మరో శుభవార్త చెప్పిన సర్కారు