Prabir Purkayastha: ‘న్యూస్‌క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం !
‘న్యూస్‌క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం !
Prabir Purkayastha: ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్‌క్లిక్(NewsClick)’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ(Prabir Purkayastha)కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అతని అరెస్టు చెల్లుబాటు కాదని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం బుధవారం ప్రకటించింది. తక్షణమే అతడిని కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. గత ఏడాది అక్టోబరు 4న రిమాండ్ ఉత్తర్వులు జారీ కాకముందు పురకాయస్థకు కానీ, అతని న్యాయవాదికి కానీ అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను లిఖిత పూర్వకంగా తెలియజేయలేదని ధర్మాసనం గుర్తించింది. ఆ కారణంగానే ఆరెస్టు చెల్లదని ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
Prabir Purkayastha Comment
ఈ సందర్భంగా గతంలో పంకజ్ బన్సల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. పురకాయస్థ అరెస్టు, తదనంతరం ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వు కూడా చట్ట ప్రకారం చెల్లదని ప్రకటిస్తూ వాటిని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. దీనితో ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు రూ.లక్ష విలువైన వ్యక్తిగత బాండును, అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులను సమర్పించిన ప్రబీర్ బుధవారం రాత్రి తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. గత ఏడాది అక్టోబరు నాలుగు నుండి ఏడు నెలలుగా ఆయన జైల్లో ఉన్నారు.
‘న్యూస్‌క్లిక్’ కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఆ పోర్టల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు గత ఏడాది అక్టోబరు 3న అదుపులోకి తీసుకున్నారు. తమ అరెస్టును, రిమాండ్‌ను సవాల్ చేస్తూ నిందితులు ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్రూవర్‌గా మారి జైలు నుంచి విడుదలైన అమిత్ చక్రవర్తి సర్వోన్నత న్యాయస్థానం నుంచి పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్ చెల్లదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.
Also Read : Mumbai Hoarding Collapse: ముంబయి హోర్డింగ్ కూలిన ఘటనలో 16కు చేరిన మృతుల సంఖ్య !