Nara Chandrababu Naidu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం !
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం !
Nara Chandrababu Naidu: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం… ఈ కేసులో భిన్నమైన తీర్పులను వెల్లడించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ అన్వయించడంలో ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేసారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా… 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పు ఇచ్చారు. దీనితో తదుపరి చర్యల కోసం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. దీనితో ఈ కేసు మరల మొదటికి వచ్చినట్లయిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Nara Chandrababu Naidu Quash Petition
ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. “ఈ కేసులో 17-ఏ వర్తిస్తుంది. చంద్రబాబు(Nara Chandrababu Naidu) కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. సెక్షన్ 17-ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని.. లేకపోతే అది చట్ట విరుద్ధం,” అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు.
జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17-ఏ ను దీనికి ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. దీనితో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ కేసును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు.
Also Read : Kuno National Park: కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృతి ! 10కి చేరిన చీతా మరణాలు