Nara Lokesh: ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా విశాఖకు లోకేష్ ! ఘన స్వాగతానికి ఏర్పాట్లు !

ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా విశాఖకు లోకేష్ ! ఘన స్వాగతానికి ఏర్పాట్లు !

Nara Lokesh: ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ఈ నెల 28వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు లోకేష్ విశాఖలోనే పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా మంత్రి లోకేశ్‌(Nara Lokesh) నగరానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు.

Nara Lokesh Visit..

విజయవాడ నుంచి 28వ తేదీ సాయంత్రం బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన నేరుగా విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. ఆ తరువాత అక్కడే బస్సులో బసచేస్తారు. ఈ నెల 29వతేదీ ఉదయం సీతంపేట రాజేంద్రనగర్‌ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి అల్పాహారం తీసుకుంటారు. అక్కడినుంచి జిల్లా కోర్టుకు వెళ్లి సాక్షి పత్రికపై దాఖలుచేసిన పరువునష్టం దావా కేసులో వాయిదాకు హాజరవుతారు. మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకుని ముఖ్యనేతలు, పార్టీ కేడర్‌ను కలుసుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.

ఈ నెల 30వ తేదీ ఉదయం పాఠశాలల పనితీరుపై విద్యాశాఖాధికారులతో సమీక్షించిన అనంతరం నగరంలోని ఒకట్రెండు పాఠశాలలను తనిఖీచేస్తారు. మధ్యాహ్నం కల్టెరేట్‌ లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహింస్తారు. తరువాత పార్టీ కార్యాలయానికి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. ఈనెల 31వ తేదీ ఉదయం తిరిగి విజయవాడ బయలుదేరి వెళతారు.

ఇందుకు సంబంధించి ఆదివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, దక్షిణ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌, జీవీఎంసీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు, నేతలు ఆళ్ల శ్రీనివాసరావు, రాజశేఖర్‌, వి.భరత్‌, బుగత సత్యనారాయణ సమావేశమై సన్నాహాలపై చర్చించారు. ఈ నెల 28న పార్టీ శ్రేణులు భారీగా ఎయిర్‌పోర్టుకు చేరుకుని లోకేశ్‌(Nara Lokesh)కు ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించాలని జిల్లా కీలక నేతలు.. కింది స్థాయి నేతలను ఆదేశించారు.

Also Read : Venkat Reddy: మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి !

Leave A Reply

Your Email Id will not be published!